Share News

క్లస్టర్ల బలోపేతానికి భలే చాన్స్‌!

ABN , Publish Date - May 24 , 2026 | 04:35 AM

క్లస్టర్‌ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ పిలుపిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్‌ స్థాయిలో జరిగే మహానాడు సన్నద్ధతపై..

క్లస్టర్ల బలోపేతానికి భలే చాన్స్‌!

  • కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేద్దాం: లోకేశ్‌

  • క్లస్టర్‌ ఇన్‌చార్జులతో ఆన్‌లైన్‌ భేటీ

అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): క్లస్టర్‌ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ పిలుపిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్‌ స్థాయిలో జరిగే మహానాడు సన్నద్ధతపై శనివారం 1875 మంది క్టస్లర్‌ ఇన్‌చార్జులతో ఆయన ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మహానాడు క్లస్టర్ల బలోపేతానికి మంచి అవకాశమని తెలిపారు. క్లస్టర్‌ పరిధిలో ఉన్న కుటుంబ సాధికార సారఽథి దగ్గర నుంచి బూత్‌ ఇన్‌చార్జి, గ్రామ పార్టీ అధ్యక్షుడు, గ్రామ కమిటీ, క్లస్టర్‌ కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపిచ్చారు. ఈసారి స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు నిర్వహించుకుంటున్నామన్నారు. ‘కొవిడ్‌ సమయంలోనూ వర్చువల్‌గా ఏర్పాటు చేసుకున్నాం. అనంతరం ఒంగోలు మహానాడును అద్భుతంగా నిర్వహించుకుని ఎన్నికలకు వెళ్లాం. ఈదఫా నెల్లూరులో ఘనంగా నిర్వహించాలనుకున్నాం. అయితే ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించుకోవాలని నిర్ణయించాం. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు మహానాడులో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో ఘనంగా నిర్వహిస్తాం. మహిళలు పెద్దఎత్తున భాగస్వాములయ్యేలా చూడాలి’ అని కోరారు.


నాయకుల మధ్య అనుబంధానికి ..

క్లస్టర్‌ ఇన్‌చార్జికి ఎక్కువ బాధ్యత ఇవ్వాలనేది చంద్రబాబు ఆదేశమని లోకేశ్‌ తెలిపారు. క్లస్టర్‌ పరిధిలోని వారందరితో నాయకులు, కార్యకర్తలకు అనుబంధం ఏర్పడుతుందన్నారు. ప్రతి క్లస్టర్‌కు పార్టీ నుంచి మెటీరియల్‌ అందజేస్తామని, స్థలం ఎంపికతోపాటు ఎల్‌ఈడీ టీవీ, స్పీకర్లు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మైటీడీపీ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేస్తారని చెప్పారు. ‘టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకే క్లస్టర్‌ ఇన్‌చార్జిగా పార్టీ అవకాశం కల్పించింది. ఈ బాధ్యతను స్వీకరించి విజయవంతంగా అమలు చేయాలి’ అని సూచించారు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, ఇందుకు సన్నద్ధం కావాలన్నారు. అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని.. ఇందుకు మహానాడును వేదికగా చేసుకోవాలని కోరారు. పనిచేసే వారికి ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జోనల్‌ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండల, పట్టణ, డివిజన్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 04:36 AM