Share News

పార్లమెంట్‌లో వాళ్లేం చేస్తారో!

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:09 AM

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం లభించే అవకాశం ఉందని మంత్రి లోకేశ్‌ అన్నారు.

పార్లమెంట్‌లో వాళ్లేం చేస్తారో!

  • 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోయినా...

  • 11 గంటల 11 నిమిషాలకు తీర్మానం: లోకేశ్‌

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం లభించే అవకాశం ఉందని మంత్రి లోకేశ్‌ అన్నారు. అమరావతి బిల్లుపై పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఏం చేస్తారో చూడాలని ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో చర్చకు 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోయినా తాము మాత్రం ముహూర్తం ప్రకారం 11గంటల 11నిమిషాలకు అమరావతి తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తానని, చంద్రబాబుకు సినిమా చూపిస్తానని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటికే ప్రజలు ఆయనకు 11 అనే బ్లాక్‌ బ్లస్టర్‌ సినిమా చూపించారని అది సరిపోలేదేమో అన్నారు. మరోసారి జగన్‌ తుగ్లక్‌ చర్యలు చూసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీ జరుగుతుంటే ఎంత సెక్యూరిటీ ఉండేదో.. ఇప్పుడు ఎంత ఉంటోందో గమనిస్తే కూటమి ప్రభుత్వం ఎంత పీపుల్స్‌ ఫ్రెండ్లీగా ఉందో తెలుస్తుందన్నారు. ఆత్మలతో మాట్లాడే అలవాటు జగన్‌కు ఇంకా పోలేదని, ఏ రోజు ఏ ఆత్మతో మాట్లాడితే ఆ రోజు ఆ ఆత్మ చెప్పినట్లు జగన్‌ మాట్లాడతారని, అందుకే రాజధానిపై అన్నిసార్లు జే టర్న్‌లు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. సజ్జల జ్ఞానం ఏపాటిదో అందరికీ తెలుసన్నారు. వైసీపీలో సజ్జల ఎవరు? ఆయనకున్న అధికారం ఏమిటి? ఆయన చేసే వ్యాఖ్యలకు వాళ్ల పార్టీలోనే తగిన ఆమోదం ఉందా? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

Updated Date - Mar 29 , 2026 | 05:10 AM