జగన్ పాలనలో విద్యారంగం విధ్వంసం
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:41 AM
వైసీపీ పాలనలో అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగం కూడా విధ్వంసానికి గురైందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పది లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేశారని తెలిపారు.
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగం కూడా విధ్వంసానికి గురైందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పది లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేశారని తెలిపారు. విద్యార్థులు ఏ బడిలో ఉన్నారో కూడా తెలియకుండా 3 లక్షల మంది వివరాలను డ్రాప్ బాక్స్‌లో ఉన్నట్లుగా చూపించి, వారి పేరుతో నిధులు డ్రా చేసుకున్నారని తెలిపారు. భాగస్వామ్యపక్షాలతో చర్చించకుండా జీవో 117 తీసుకొచ్చి పాఠశాల విద్యాశాఖను తీవ్రస్థాయిలో దెబ్బతీశారని చెప్పారు. విద్యాశాఖ బడ్జెట్ పద్దుపై చర్చలో బుధవారం శాసనసభలో మంత్రి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
ఫలితాలు దెబ్బతీశారు
జీవో 117 వల్ల ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 12,512కు పెరిగింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పడిపోయాయి. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో 27వ స్థానానికి పడిపోయాం. ఐదో తరగతి గణితంలో 5 నుంచి 21వ ర్యాంకుకు చేరాం. దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మనం అంగీకరించక తప్పని పరిస్థితిని కల్పించారు. మేం వచ్చాక సీబీఎ్‌సఈ విద్యార్థులకు నమూనా పరీక్ష పెడితే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. రూ.59 కోట్లు ఖర్చు చేసినా కూడా గత ప్రభుత్వం టోఫెల్‌లో ఒక్క పరీక్ష కూడా పెట్టలేదు. ఐబీపై కేవలం రిపోర్టు కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారు. టీచర్లను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టి అవమానించారు. అభ్యసన ఫలితాల సాధనపై దృష్టిసారించాం. అక్షరాస్యత నూరుశాతం సాధించేలా కార్యక్రమం అమలుచేస్తున్నాం. పాఠశాలల్లో క్లిక్కర్ టెక్నాలజీ అమలుచేస్తున్నాం. విద్యార్థులకు వీడియోలు చూపించి సమాధానాలను క్లిక్కర్ల ద్వారా తీసుకుంటారు. ప్రస్తుతం 300 పాఠశాలల్లో ఇది అమల్లో ఉంది. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ క్లిక్కర్ విధానం అమలుచేస్తాం. 125 ‘ఆటిజం’ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.
వర్సిటీలను రాజకీయం చేశారు
గత ప్రభుత్వంలో ఆంధ్రయూనివర్సిటీ(ఏయూ) వీసీ ప్రసాద్‌రెడ్డి చేసిన పని ఏంటంటే.. జగన్ వచ్చినప్పుడు విద్యార్థులను రోడ్లపై నిలబెట్టి చప్పట్లు కొట్టించారు. అర్హత లేకపోయినా జగన్ బంధువు సుందరవల్లిని ఎస్వీయూ రెక్టార్‌గా నియమించారు. ఆమెనే మళ్లీ విక్రమసింహపురి వీసీగా నియమించారు. మరో బంధువు రామకృష్ణారెడ్డిని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీని చేశారు. బావమరిది సురేంద్రనాథ్‌రెడ్డిని ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్ర్టార్‌గా నియమించారు. ప్రొఫెసర్‌గా పదేళ్ల అర్హత లేకపోయినా శ్రీకాంత్‌రెడ్డికి ఎస్వీయూ వీసీగా బాధ్యతలు అప్పగించారు.
ప్రతివారం పరిశీలించండి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎమ్మెల్యేలంతా బాధ్యత తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచి ంచారు. నియోజకవర్గంలో ఒక్క పాఠశాలలో అయి నా కనీసం వెయ్యి మంది విద్యార్థులుండేలా చేయాలని సూచించారు. ‘‘ప్రతివారం కనీసం ఒక పాఠశాలను సందర్శించండి. అక్కడ ఏవైనా లోపాలుంటే నేరుగా నాకు మెసేజ్ చేయండి. సరిదిద్దుకుందాం. మనమంతా కలిసి ఏపీ విద్యను దేశానికి మోడల్‌గా నిలపాలి.’’ అని ఎమ్మెల్యేలకు సూచించారు.