Share News

Minister Lokesh: వాణిజ్య బంధం బలోపేతానికి సహకరించండి

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:06 AM

స్విట్జర్లాండ్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి సహకరించాలని స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్‌ కుమార్‌కు రాష్ట్ర మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

Minister Lokesh: వాణిజ్య బంధం బలోపేతానికి సహకరించండి

  • ఏపీలో పెట్టుబడులకు స్విస్‌ కంపెనీలను ప్రోత్సహించండి

  • స్విస్‌లో భారత రాయబారి మృదుల్‌ కుమార్‌తో మంత్రి లోకేశ్‌

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి సహకరించాలని స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్‌ కుమార్‌కు రాష్ట్ర మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. జ్యూరిక్‌లో మృదుల్‌తో మంత్రి లోకేశ్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం స్విస్‌ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని ఈ సందర్భంగా లోకేశ్‌ వెల్లడించారు. టెక్నాలజీ, టెక్స్‌టైల్స్‌, యంత్రాల తయారీ, ఎలకా్ట్రనిక్స్‌, రైలు విడిభాగాల తయారీ, ఫార్మా, పరిశోధనా- అభివృద్ధి, వర్సిటీలతో సహకారం వంటి వాటిలో తాము స్విస్‌ సహకారం ఆశిస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. స్విస్‌లోని జ్యూరిక్‌, బాసెల్‌, బెర్మ్‌, జెనీవా వంటి ప్రఖ్యాత వర్సిటీలతో కలసి రాష్ట్రంలోని వర్సిటీలలో విద్యా అనుసంధానం ద్వారా వివిధ రకాల కోర్సులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేశ్‌ వెల్లడించారు. మెడికల్‌ డివైజెస్‌, స్టార్టప్‌, ఎక్స్ఛేంజీ ప్రోగ్రామ్‌లలో పరస్పర సహకారం కోరుకుంటున్నామని చెప్పారు. గ్లోబల్‌ స్థాయిలో విస్తరించి ఉన్న తెలుగు డయాస్పోరా రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతోందని మృదుల్‌కు లోకేశ్‌ వివరించారు. స్విస్‌లో భారత సాంకేతిక ప్రతిభకు మంచి డిమాండ్‌ ఉందని అన్నారు.


రాష్ట్రం నుంచి మరింత మంది నిపుణులను స్విస్‌కు పంపేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి లోకేశ్‌ అభ్యర్థనపై మృదుల్‌ సానుకూలంగా స్పందించారు. గత ఏడాది అక్టోబరు ఒకటిన భారత్‌-యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ మధ్య జరిగిన ట్రేడ్‌ అండ్‌ ఎకనామిక్‌ భాగస్వామ్య ఒప్పందంలో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంఽధాలు బలోపేతమయ్యాయని వెల్లడించారు. రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. భారత్‌లో పది లక్షలమంది యువతకు ఉగ్యోగాలను కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవకు తమ సహకారం ఉంటుందని మృదుల్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Jan 20 , 2026 | 06:07 AM