Share News

Minister Lokesh: వ్యవసాయ ఎగుమతుల క్లస్టర్లకు మద్దతివ్వండి

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:40 AM

ఫుడ్‌ సెక్యూరిటీ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో అంతర్జాతీయంగా 140 దేశాల్లో సప్లయ్‌ చైన్‌ ఇంటిగ్రేషన్‌ కలిగి ఉన్న బ్యూలర్‌ గ్రూప్‌...

Minister Lokesh: వ్యవసాయ ఎగుమతుల క్లస్టర్లకు మద్దతివ్వండి

  • బ్యూలర్‌ ఇండియా చైర్మన్‌ దీపక్‌కు మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి

  • జ్యూరిక్‌లో సినర్జిటిక్‌ ఎండీ జోస్‌ మెల్లాడోతోనూ భేటీ

  • పోర్టుల్లో హైడ్రోజన్‌ కో-పైలట్‌ వాహనాల అభివృద్ధి వినతి

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఫుడ్‌ సెక్యూరిటీ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో అంతర్జాతీయంగా 140 దేశాల్లో సప్లయ్‌ చైన్‌ ఇంటిగ్రేషన్‌ కలిగి ఉన్న బ్యూలర్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సలహాదారు, బ్యూలర్‌ ఇండియా చైర్మన్‌ దీపక్‌ మానేతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యూలర్‌ ఫుడ్స్‌ అండ్‌ గ్రెయిన్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పైలట్‌ ట్రయల్స్‌ ప్రోడక్ట్‌ లోకలైజేషన్‌ ద్వారా ఏపీలోని వ్యవసాయ ఎగుమతుల క్లస్టర్లకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బ్యూలర్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని రాష్ట్రంలో వాణిజ్య స్థాయి ప్రదర్శన, స్కేలప్‌ సౌకర్యంగా మార్చడానికి సహకారం అందించాలని కోరారు. మిల్లెట్‌ ఆధారిత ఆహార పరిశ్రమ అభివృద్ధితో పాటు మెరుగైన దిగుబడులు, ఎక్స్‌పోర్ట్‌ రెడీ న్యూట్రిషన్‌కు బ్యూలర్‌ సహకారం కావాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనతో పాటు స్వదేశీ తయారీని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, బ్యూలర్‌ గ్లోబల్‌ అప్లికేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్లాంట్‌ ఆపరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో ఫుడ్‌ పార్కులు, అగ్రి ఇండస్ట్రియల్‌ కారిడార్లకు మద్దతు అందించాలన్నారు. కాగా, దేశంలో బెంగళూరు ప్రధాన కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తోందని దీపక్‌ మానో వెల్లడించారు.


ఈ క్యాంపస్‌ ద్వారా ఫుడ్‌ గ్రెయిన్స్‌, రైస్‌ ప్రాసెసింగ్‌, బిస్క ట్స్‌, డ్రయర్స్‌, కాఫీ రోస్టింగ్‌ తయారీ, ఆప్టికల్‌ పార్టింగ్‌ సేవలను ఇంటిగ్రేట్‌ చేస్తున్నామని చెప్పారు. వడోదర, హైదరాబాద్‌, రాయపూర్‌, కాకినాడల్లో తమకు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. కాకినాడ బ్రాంచి రీజినల్‌ సేల్స్‌ అండ్‌ లైఫ్‌ సైకిల్‌ సర్వీస్‌ నోడ్‌గా పనిచేస్తుందని, ఇది రాష్ట్రమంతటా కస్టమర్‌ ఇంటర్‌ఫేస్‌, సర్వీస్‌ కోఆర్డినేషన్‌, స్పేర్స్‌ ఫెసిలిటేషన్‌ అందిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, ప్రతిపాదనలను పరిశీలిస్తామని మనో ప్రకటించారు.


హైడ్రోజన్‌ కో-పైలట్‌ వాహనాలను అభివృద్ధి చేయండి..

స్పెయిన్‌కు చెందిన ఎవల్యూషన్‌ సినర్జిటిక్‌ ఆటోమోటివ్‌ ఎస్‌ఎల్‌ సంస్థ ఎండీ జోస్‌ మెల్లాడోతోనూ మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, జీరో ఎమిషన్‌ వెహికల్స్‌ల్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యులను బలోపేతం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నామని తెలిపారు. కాంప్లెక్స్‌ వెహికల్స్‌, మొబిలిటీ సిస్టమ్స్‌ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఏవో సంస్థ ఆధ్వర్యాన వైజాగ్‌/కాకినాడ పోర్టుల్లో హైడ్రోజన్‌ టెర్మినల్‌ ట్రాక్టర్స్‌ పైలట్‌ వాహనాలను అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో ఎలక్ట్రిక్‌/హైడ్రోజన్‌ ఆఫ్‌ రోడ్‌ వాహనాల కోసం కో-పైలట్‌ను అభివృద్ధి చేసి, రీడిజైన్‌, ఆప్టిమైజేషన్‌కు నేతృత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అవసరమైన టెస్ట్‌ బెడ్‌లు, అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 05:42 AM