Share News

మేం పరదాలు కట్టుకుని తిరగట్లేదు

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:36 AM

గత పాలకుల మాదిరిగా తాము పరదాలు కట్టుకుని తిరగటం లేదని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాల గురించి వైసీపీ సభ్యుల ప్రశ్నకు...

మేం పరదాలు కట్టుకుని తిరగట్లేదు

  • ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు

  • సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం

  • పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు: మంత్రి లోకేశ్‌

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): గత పాలకుల మాదిరిగా తాము పరదాలు కట్టుకుని తిరగటం లేదని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాల గురించి వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానం ఇస్తుండగా, విపక్ష నేత బొత్స జోక్యం చేసుకుని, అంగన్వాడీలు ఆందోళన చేస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ... ‘మేం పరదాలు కట్టుకుని తిరగటం లేదు. ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేం ఎవరినీ అరెస్టు చేయలేదు’ అని స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉందని మంత్రి సంధ్యారాణి చెప్పారు. తల్లికి వందనంపై వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ స్పందించారు. ‘తల్లికి వందనం కింద అర్హులందరికీ సాయం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్లు చెల్లించాం. 85 శాతం మంది విద్యార్థులకు సాయం చేశాం’ అని చెప్పారు. దీనిపై విపక్ష నేత బొత్స అభ్యంతరం చెప్పగా, వైసీపీ హయాంలో కేవలం 52 శాతం మందికే అమ్మఒడి పడిందని లోకేశ్‌ చెప్పారు. అర్హత ఉన్న వారికి డబ్బులు పడకపోతే మళ్లీ వేస్తామన్నారు. శానిటరీ న్యాప్‌కిన్స్‌కు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.18.96 కోట్లు పెండింగ్‌ పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు.

తీర ప్రాంతంలో తుఫాను షెల్టర్లు: మంత్రి అనిత

టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి అనిత స్పందిస్తూ.. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో కొత్తగా బహుళ ప్రయోజన తుఫాను షెల్టర్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు... కలిపి మొత్తం 122 మంది వీఆర్‌లో ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated Date - Mar 07 , 2026 | 04:36 AM