విశాఖకు రండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:19 AM
దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘క్యాప్‌జెమినీ’ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపింది. గురువారం విశాఖలో...
సాగరనగరంలో డీసీ, జీసీసీ ఏర్పాటు చేయండి
20 వేల ఉద్యోగాలు ఇచ్చేలా వాటిని నెలకొల్పండి
క్యాప్‌జెమినీ సీఈవోకు మంత్రి లోకేశ్ ఆహ్వానం
విశాఖపట్నం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘క్యాప్‌జెమినీ’ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపింది. గురువారం విశాఖలో క్యాప్‌జెమినీ సీఈఓ ఐమాన్ ఎజ్జత్, బృందంతో రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌తో కలిసి మంత్రి లోకేశ్ మాట్లాడారు. విశాఖలో ఐటీ డెవల్‌పమెంట్ సెంటర్ (డీసీ), గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని క్యాప్‌జెమినీ సీఈవోను మంత్రి లోకేశ్ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ, ఏఐ డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని వివరించారు. దేశంలోనే అతి పెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు విశాఖకు వచ్చాయన్నారు. త్వరలో ప్రారంభ కాబోయే భోగాపురం ఎయిర్‌పోర్టుతో అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. విశాఖలో ప్రత్యేకంగా ఐటీ ఎకో సిస్టమ్ ఉందన్నారు. అత్యంత అనుకూలమైన విశాఖలో 20 వేల మందికి ఉద్యోగాలు లభించేలా ఐటీ డెవల్‌పమెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. క్లౌడ్ సర్వీసులు, బిజినెస్ ప్రోసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం)లకు సేవా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ డెవల్‌పమెంట్‌లో ఏపీ యూనివర్సిటీలతో సహ అభివృద్ధి భాగస్వామిగా నూతన టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఆప్టిమైజేషన్, ఆర్థిక సేవల్లో ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు సహకారం అందించేందుకు డెడికేటెడ్ క్వాంటమ్ వర్టికల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. క్యాప్‌జెమినీ సీఈవో ఐమాన్ ఎజ్జత్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది, భారత్‌లో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ సంజయ్ చాకే, డబ్ల్యుఎన్‌ఎస్ గ్లోబల్ సీఈఓ కేశవ్ మురుగేశ్ పాల్గొన్నారు.