కార్యకర్తలే టీడీపీ బలం.. బలగం!
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:31 AM
‘కార్యకర్తలే టీడీపీ బలం, బలగం. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే దమ్ము, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఒక్క టీడీపీకే సొంతం. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్నది వారే.
వారికి పార్టీ కోసం ప్రాణాలిచ్చే దమ్మూ, ధైర్యం
సీనియర్లను గౌరవిస్తాం.. కష్టపడేవారిని ప్రోత్సహిస్తాం
పంచాయతీ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేయాలి
జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్: లోకేశ్
అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘కార్యకర్తలే టీడీపీ బలం, బలగం. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే దమ్ము, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఒక్క టీడీపీకే సొంతం. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్నది వారే. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేతలు.’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ అన్నారు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో, ఆ తర్వాత ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఇచ్చిన ఆత్మీయ విందులో లోకేశ్ మాట్లాడారు. ‘మానవత్వానికి మానవ రూపం ఎన్టీఆర్. అప్పటివరకు ఏ నాయకుడు చేయని విధంగా 35వేల కిలోమీటర్ల యాత్ర చేశారు. ప్రజాజీవితంలో తలమునకలైన ఎన్టీఆర్.. తన కుమారులు బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లిళ్లకూ రాలేదు. పార్టీ ప్రారంభించిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన చరిత్ర ఒక్క టీడీపీకే సొంతం. రికార్డులు బద్దలు కొట్టాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం.’ అని లోకేశ్ పేర్కొన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌కి దక్కితే అభివృద్ధిని పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారి వృద్ధాప్య పింఛన్లు ఇచ్చింది ఎన్టీఆర్ అని, కిలో రూ.2 బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కు, నిరుపేదలకు పక్కా ఇళ్లు, ఇవన్నీ ఆయన చలవేనని గుర్తుచేశారు. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు అన్నారు. ప్రజల వద్దకు పాలన, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్, దీపం పథకం, డ్వాక్రా పథకంతో పాటు పట్టిసీమ, రైతుబజార్లు, సైబరాబాద్, ఇవన్నీ చంద్రబాబు ఘనతలుగా పేర్కొన్నారు. ఆయన వయస్సు 75 కానీ స్పీడ్ 25 ఏళ్ల కుర్రాడిలా ఉంటుందని, చంద్రబాబు రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదని, ఇక పుట్టబోడని స్పష్టం చేశారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సత్తా చాటాం
‘గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన పసుపు జెండా పవర్ ఏంటో చూపించాం. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర చాలా బలంగా ఉంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించింది. 2019 నుంచి 2024 వరకు అరాచక పాలన చూశాం. ఆ ఐదేళ్లలో 79మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులను చంపారు. కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం కార్యకర్తలతో కత్తులు పట్టించాయి. కానీ చంద్రబాబు మాత్రం వారితో పుస్తకాలు పట్టించారు. ఫ్యాక్షన్ దాడుల్లో కార్యకర్తలు చనిపోతే వారి పిల్లలను దత్తత తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చారు. పాదయాత్రలో నేను ఆ పిల్లలను కలిశాను. ఒకరు డెలాయిట్, మరొకరు గూగుల్ వంటి సంస్థల్లో పనిచేస్తున్నారు.’ అని లోకేశ్ వివరించారు. చంద్రబాబు కృషి.. శ్రమ వల్లే నేడు మనం ఈ స్థాయిలో ఉన్నామని లోకేశ్ తెలిపారు. ‘కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించాలి. వారిని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ తీసుకుంటుంది. పార్టీ కేడర్‌కు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి’ అని లోకేశ్ కోరారు. సీనియర్లను గౌరవిస్తామని, పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.