రాష్ట్రమంతా ఆర్డీటీ సేవలు విస్తరించాలి
ABN , Publish Date - May 15 , 2026 | 04:21 AM
పేదలకు రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అందిస్తున్న సేవలు రాయలసీమ వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని టీడీపీ..
పేదలకు సేవ చేస్తున్న సంస్థకు అండగా నిలిచాం
ఆర్డీటీ ఆస్పత్రి సందర్శన సందర్భంగా మంత్రి లోకేశ్
శ్రీసత్యసాయి జిల్లాలో లోకేశ్‌కు ఘన స్వాగతం
తక్కువ వాహనాలతో కాన్వాయ్
ధర్మవరం, మే 14(ఆంధ్రజ్యోతి): పేదలకు రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అందిస్తున్న సేవలు రాయలసీమ వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిని ఆయన గురువారం సందర్శించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ పెర్రర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. విన్సెంట్ సతీమణి, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, తనయుడు, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, కూతురు యమున, ఆమె భర్త సంజీవ్‌తో మాట్లాడారు. ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి లోకేశ్ మాట్లాడారు. తలసేమియా బాధిత చిన్నారులను పరామర్శించారు.
పాదయాత్రలో కళ్లారా చూశా..
ఆర్డీటీ సేవల గురించి తాను గతంలో విన్నానని, యువగళం పాదయాత్ర సమయంలో కళ్లారా చూశానని లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆర్డీటీ పాఠశాలలో దివ్యాంగ పిల్లలను సొంతబిడ్డల్లా చూసుకుంటున్న దృశ్యాలను స్వయ ంగా చూశానన్నారు. నిరుపేదలకు వైద్యం, విద్య, గృహాలు, యువతకు క్రీడల్లో ప్రోత్సాహం వంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలను ఫెర్రర్ కుటుంబం 52 ఏళ్ల నుంచి అందిస్తోందని కొనియాడారు. ఆర్డీటీ కష్టాలను ఎదుర్కొన్నపుడు ఆసంస్థకు అండగా నిలబడటం తమ బాధ్యత అని సీఎం చంద్రబాబుతోపాటు కూటమి నేతలంతా కలిసికట్టుగా నిలబడ్డామని వెల్లడించారు. సంస్థపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కొన్ని అపోహలను తొలగించి, ఫారిన్ కంట్రబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్సులు రెన్యువల్ చేయించి, అండగా నిలబడ్డామని తెలిపారు.
లోకేశ్‌కు కృతజ్ఞతలు: మాంఛో ఫెర్రర్
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అన్నారు. తాను లోకేశ్‌ను కలిసినప్పటి నుంచి తమ సంస్థకు అండగా నిలుస్తూ వచ్చారని ఆయన చెప్పారు.