Share News

వైసీపీపై ఇక అఫెన్సే!

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:58 AM

ఇప్పటి వరకు వైసీపీ మనపై విమర్శలు చేస్తే.. మనం డిఫెన్స్‌ ఆడుతూ సమస్యను అధిగమిస్తున్నామని, ఇకపై గేమ్‌ ప్లాన్‌ మారుద్దామని, మనమే అఫెన్స్‌ గేమ్‌ ఆడదామని మంత్రి లోకేశ్‌ అన్నారు.

వైసీపీపై ఇక అఫెన్సే!

  • గేమ్‌ప్లాన్‌ మారుద్దామన్న లోకేశ్‌

  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇష్టాగోష్ఠి

  • చిత్తూరు, అనకాపల్లి ప్రజాప్రతినిధులతోనూ ఆత్మీయ భేటీ

  • నేడు విజయవాడ, గుంటూరు ప్రజాప్రతినిధులతో లంచ్‌

  • 28న యలమంచిలిలో బ్లూజెట్‌కు శంకుస్థాపన

అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు వైసీపీ మనపై విమర్శలు చేస్తే.. మనం డిఫెన్స్‌ ఆడుతూ సమస్యను అధిగమిస్తున్నామని, ఇకపై గేమ్‌ ప్లాన్‌ మారుద్దామని, మనమే అఫెన్స్‌ గేమ్‌ ఆడదామని మంత్రి లోకేశ్‌ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టీడీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని వైసీపీ ఐదేళ్లలో ఏ స్థాయిలో సర్వనాశనం చేసిందో ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ వెళ్దామన్నారు. ఆ పార్టీ వైర్‌సలా ఎంత ప్రమాదకారో వివరించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఈ అఫెన్స్‌ గేమ్‌లో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. ఈ నెల 28న అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో అతిపెద్ద ఫార్మా సంస్థ బ్లూజెట్‌కు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓ వ్యక్తి బ్లూజెట్‌ సంస్థలో ఉద్యోగిగా ఉన్నారని, సంస్థ విస్తరణ ఆలోచనపై ఆయన తనకు పెట్టిన మెసేజ్‌ ఆధారంగా ఫాలో అప్‌ చేసి ఆ సంస్థను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో గెలిచిన టీడీపీ మద్దతుదారులతో ఈ నెలాఖరులోపు సీఎం సమావేశమవుతారని తెలిపారు. కాగా.. చిత్తూరు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అనంతరం వారు లోకేశ్‌ను కలిశారు. ‘లీడర్‌తో ఆత్మీయ సమావేశం’లో పాల్గొన్నారు. ఇందులో అనకాపల్లి ఎంపీ స్థానం పరిధిలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేడు విజయవాడ, గుంటూరు ప్రజాప్రతినిధులతో లోకేశ్‌ భేటీ అవుతారు. సాధారణంగా రాత్రి 7 గంటలకు జరుగుతున్న ఈ సమావేశాలు శనివారం మాత్రం మధ్యాహ్న భోజన భేటీగా మారాయి. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఈ సమావేశం జరుగుతుంది. గుంటూరు, విజయవాడ ఎంపీలతోపాటు రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ హాజరుకానున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:58 AM