కార్యకర్తే అధినేత!
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:09 AM
‘‘కార్యకర్తే అధినేత అనే నినాదంతో ముందుకెళ్తున్నా. టీడీపీలో క్లస్టర్లది చాలా కీలకపాత్ర. యూనిట్, బూత్‌లను సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదే.’’ అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ అన్నారు.
తప్పులు, ఒప్పులు తెలియజేయండి.. బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు వద్దు
మైటీడీపీ యాప్‌ను వేదికగా చేసుకోండి.. టీడీపీ 3.0 వెర్షన్ నడుస్తోంది
పార్టీలో సమూల మార్పులు తెస్తాం.. టీడీపీ శిక్షణ తరగతుల్లో లోకేశ్
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘‘కార్యకర్తే అధినేత అనే నినాదంతో ముందుకెళ్తున్నా. టీడీపీలో క్లస్టర్లది చాలా కీలకపాత్ర. యూనిట్, బూత్‌లను సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదే.’’ అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ అన్నారు. ప్రస్తుతం టీడీపీ 3.0 వెర్షన్ నడుస్తోందని, పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళుతామని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి కార్యకర్త ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమీక్షించాలి. తప్పులు, ఒప్పులను వివరించాలి. అయితే బహిరంగ వేదికలపై కాకుండా మైటీడీపీ యాప్ ద్వారా తెలియజేయాలి. చంద్రబాబు చుట్టూ.. నా చుట్టూ కోటరీలేదు. అన్ని విషయాలను నేరుగానే తెలుసుకుంటున్నాం. టీడీపీ యూనివర్సిటీలాంటిది. ఎంతో మంది గొప్ప నాయకులను తయారు చేసింది. తెలంగాణలో తొలి, మలి ముఖ్యమంత్రులు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారే. గతంలో గండిపేటలో నిరంతరాయంగా పార్టీ శిక్షణ తరగతులు జరిగేవి. ఇప్పుడు ఏడాదిలో కనీసం 300 రోజులు పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మీకు పదవులు ఇస్తున్నాం. ఏం చేయాలో చెప్పడం లేదు. చాలా మందికి బాధ్యతలు కూడా తెలీదు. దేని ఆధారంగా పార్టీ తమను గుర్తించిందో కూడా తెలియదు. అందుకే ఈ శిక్షణ తరగతుల్లో వారికి అన్ని అంశాలపైనా అవగాహన కలిగిస్తున్నాం.’’ అని అన్నారు.
వైసీపీది అహంకారం: వైసీపీ 11 సీట్లకు పరిమితం కావడానికి వారి అహంకారమే కారణమని లోకేశ్ అన్నారు. అందుకే అందరినీ కలుపుకొని పోవాలని, ప్రజలు అహంకారాన్ని ఒప్పుకోరనే విషయాన్ని గమనించాలని సూచించారు. ‘‘టీడీపీ సొంతిల్లు లాంటిది. ప్రభుత్వం అద్దె ఇల్లు లాంటిది. అందుకే వారంలో ఎన్ని పనులున్నా ఒకరోజు పార్టీకి కేటాయిస్తున్నా. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి బూత్‌లోనూ మెజార్టీ తీసుకొస్తే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించవచ్చు. పార్టీలో కూడా నిరంతరం మార్పు రావాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో మూడుసార్లు కంటే ఎక్కువగా ఉండకూడదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాలుగోసారి కొనసాగుతున్నా. ఆ పదవి నాకు వద్దని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పా.’’ అని వ్యాఖ్యానించారు. ప్రతి క్లస్టర్ ఇన్‌చార్జి పొలిట్‌బ్యూరో స్థాయికి ఎదగాలన్నది తన ఆశ అని లోకేశ్ తెలిపారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమ వేదికపై చంద్రబాబుతోపాటు క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రంలో నెంబర్ 1గా నిలిచిన 19 మంది కార్యకర్తలకు కూర్చునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.