చేతల్లో అభివృద్ధి
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:03 AM
కూటమి ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు.
ప్రభుత్వ తీరుతోనే పరిశ్రమలు వస్తున్నాయి
అనకాపల్లి జిల్లాలో మంత్రి లోకేశ్
బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఫార్మా కంపెనీకి భూమి పూజ
అనకాపల్లి/రాంబిల్లి/అచ్యుతాపురం రూరల్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలో గల సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్‌లో బ్లూజెట్ హెల్త్‌కేర్ (బీజేహెచ్‌ఎల్) ఫార్మా సంస్థ ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌కు శనివారం ఆయన భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్, విశ్వసనీయత, పరిశ్రమల గ్రౌండింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రను ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. బ్లూజెట్ కంపెనీ రూ. 2,300 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుచేసి, 1,750 మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని లోకేశ్ వెల్లడించారు.
క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, ఐటీ, డిజిటల్ సర్వీసెస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక శక్తి, ఫార్మాసూటికల్స్, హెల్త్‌కేర్ వంటి 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ప్రముఖ ఔషధ తయారీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని తీర్చిదిద్దాలనేది లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రాభివృద్ధికి కసితో పనిచేస్తున్నారన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, బ్లూజెట్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా, బ్లూజెట్ హెల్త్‌కేర్ ఫార్మా కంపెనీ చైర్మన్ అక్షయ్ అరోరా పాల్గొన్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్స్‌తో లోకేశ్ భేటీ
అనకాపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లతో మంత్రి లోకేశ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో సోషల్‌మీడియా ప్రతినిధులు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాలని మంత్రి సూచించినట్టు తెలిసింది.