భోజనం బాగోకపోతే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:53 AM
ప్రభుత్వ పాఠశాలల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.
నాణ్యతను టీచర్ నిర్ధారించాకే పిల్లలకు..
మైలవరం ‘అధ్వానం డ్రామా’పై లోకేశ్ సమీక్ష
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. మైలవరంలో ఇటీవల అధ్వాన భోజనం అంటూ హెచ్‌ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో శుక్రవారం ఫోన్ ద్వారా ఆయన అధికారులతో సమీక్షించారు. మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడే భోజనం బాగాలేదని కుట్రపూరితంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని తమ దర్యాప్తులో తేలిందని అధికారులు మంత్రికి వివరించారు. ఇలాంటి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. మన ఇంట్లో పిల్లలకు భోజనం పెట్టినట్లే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకూ నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ముందుగా టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు ఏదోఒక బడికివెళ్లి మధ్యాహ్నభోజనం తిని, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. లీప్ యాప్ ద్వారా భోజనం గురించి తల్లిదండ్రుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు.