Share News

నమ్మకమైన భాగస్వాములవుతాం!

ABN , Publish Date - Jul 06 , 2026 | 04:43 AM

దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా మారేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు.

నమ్మకమైన భాగస్వాములవుతాం!

  • కొరియాతో ఏపీ బంధం బలోపేతం: లోకేశ్‌

  • కియలాంటి మరిన్ని విజయగాధల కోసం కృషి

  • ప్రవాసాంధ్రులందరూ పెట్టుబడుల రాయబారులే

  • వారితో కలసి పనిచేయడానికి సిద్ధం

  • ఏపీలో అవకాశాలను కొరియన్‌ కంపెనీలకు వివరించాలి.. సియోల్‌లోని ప్రవాసాంధ్రులకు పిలుపు

అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా మారేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో భారత్‌-దక్షిణ కొరియా తరహాలోనే.. ఏపీ-కొరియా మధ్య బంధం బలపడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులంతా రాష్ట్రానికి పెట్టుబడుల రాయబారులేనన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ప్రవాసాంధ్రుల డయాస్పోరాలో పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు విజయాలు సాధించినప్పుడు, వ్యాపారాలను, వాణిజ్యాన్ని ప్రారంభించినప్పుడు, పేరు ప్రఖ్యాతులు పొందినప్పుడల్లా.. రాష్ట్రానికి ప్రతినిధులుగా వారిని చూసి గర్వపడుతుంటామని లోకేశ్‌ చెప్పారు. ప్రవాసాంధ్రులున్న చోటల్లా రాష్ట్రాభివృద్ధి గాధలు చెప్పాలనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, వాణిజ్యం చేపట్టేందుకు ఉన్న వనరులు, అవకాశాల గురించి కొరియాకు వివరించాలని వారిని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారికి, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూసేవారికి వేగవంతమైన అనుమతులిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కొరియన్లకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఆ దేశ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించాలన్నారు. ఒక్కసారి రాష్ట్రంలో పారిశ్రామిక వేగవంతాన్ని చూస్తే వారు పెట్టుబడులు పెడతాయని అభిప్రాయపడ్డారు. ఆ దేశంతో ఏ రంగంలో పనిచేసేందుకైనా రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్క పెట్టుబడిదారునూ నిజాయితీగా ఆహ్వానిస్తోందని స్పష్టం చేశారు. ప్రతి ఆవిష్కర్త కంపెనీని ఆదరిస్తామని తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి కలిగిన ప్రతి పారిశ్రామికవేత్తా.. ఆంధ్రప్రవేశ్‌ను తమ స్థావరంగా ఎంచుకోవాలని కోరారు.


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిగిన వారందరినీ స్వాగతిస్తామన్నారు. ప్రపంచ దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు సాధించే ప్రతి విజయమూ దేశానికి గర్వకారణమేనని లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగువారు లేని ప్రాంతమే లేదన్నారు. ఎక్కడకు వెళ్లినా వారి ఉనికి ఉంటుందని.. తాను ఎక్కడకు వెళ్లినా తన పరిచయాలు తెలుగు ప్రపంచంతోనేనని చెప్పారు. ప్రవాసాంధ్రులకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపై అపారమైన ప్రేమ, వాత్సల్యం ఉంటాయన్నారు. ఈ వేదికను ఏర్పాటు చేసిన ఎంబసీ అధికారులకు, ప్రవాస భారతీయులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. దేశానికి దూరంగా నివిసిస్తున్న తెలుగువారిని చూసినప్పుడల్లా సంతోషంగా, గర్వంగా భావిస్తానన్నారు. కష్టపడే మనస్తత్వం, నైపుణ్యం, సంకల్పం ద్వారా భారతదేశానికి గౌరవాన్ని తెస్తున్నారని ప్రశంసించారు. ప్రవాసాంధ్రుల ప్రతి విజయం దేశ ప్రతిష్ఠను పెంచుతోందన్నారు.


దక్షిణ కొరియా విజయగాధ మనకు ప్రేరణ

దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం ఆంధ్రప్రదేశ్‌కు ప్రేరణగా లోకేశ్‌ అభివర్ణించారు. సామ్‌సంగ్‌, హ్యూండయ్‌, ఎల్‌జీ, కియ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయన్నారు. సంపద కేవలం ప్రకృతి వనరుల ఆధారంగానే రాదని.. శ్రమ, ఆవిష్కరణలు, శాస్త్రీయ దృక్పథం, తపన ద్వారానే వస్తాయని తెలిపారు. దక్షిణ కొరియా విజయగాధ రాష్ట్రానికి ఆదర్శమన్నారు. భారత్‌-కొరియా మధ్య సంబంధం కేవలం వాణిజ్యపరమైనదే కాదని.. ప్రజాస్వామ్య విలువలు, పరస్పర విశ్వాసంతో కలిసి నడుస్తున్నాయని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఎలకా్ట్రనిక్స్‌, ఆటోమొబైల్స్‌, సెమీ కండక్టర్లు, గ్రీన్‌ఎనర్జీ, షిప్‌బిల్డింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో బంధం ఏర్పడిందన్నారు. కియ విజయగాధ రాష్ట్రానికి ఆదర్శమన్నారు. ‘ఆ కంపెనీ ప్లాంటు ఏర్పాటుకు భూమి కోసం అన్వేషిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఆనాడు చంద్రబాబు కియ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ నిర్ణయం తీసుకోవడంతో పాటు.. అన్ని అనుమతులు, భూ కేటాయింపులు, నీటి సదుపాయాన్ని కల్పించారు. రాష్ట్రంలో కియ ఏర్పాటుతో ఆటోమొబైల్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పడింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోనూ ఆటోమొబైల్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చెందింది. ఏపీలో కియ ద్వారా వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. కొరియాతోనూ మరిన్ని సక్సెస్‌ స్టోరీలు కొనసాగాలి. ఐటీ, సెమీకండక్టర్లు, మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఏఐ, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ వంటి ఏరంగంలోనైనా ఆ దేశంతో కలసి ప్రయాణం చేసేందుకు ఏపీ సిద్ధం’ అని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో కరిక్యులమ్‌ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. బలమైన రాష్ట్రాలతో బలీయమైన దేశంగా భారత్‌ వృద్ధి చెందుతుందని లోకేశ్‌ ఆకాంక్షించారు.

Updated Date - Jul 06 , 2026 | 04:44 AM