చిన్నారుల భోజనం బాగుండాలి!
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:17 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన’ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి లోకేశ్ ఉపాధ్యాయులను ఆదేశించారు.
పదార్థాలు నాణ్యంగా ఉండాలి
మధ్యాహ్న భోజన పథకంలో
పొరపాట్లకు తావివ్వొద్దు: లోకేశ్
ఉపాధ్యాయులకు పలు సూచనలు
మైలవరంలోని పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
విద్యార్థుల భోజనం రుచిచూసిన మంత్రి
మైలవరం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన’ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి లోకేశ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకందించే భోజనం రుచిగా, శుచిగా ఉండాలని సూచించారు. నాణ్యమైన భోజనం అందించడంతోపాటు అక్రమాలను అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్‌ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. తద్వారా మధ్యాహ్న భోజనం విషయంలో సమూల మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని దేవుని చెరువు ప్రాంతంలో తారకరామానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి లోకేశ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని ఆరోపిస్తూ.. ప్రధానోపాధ్యాయుడు(హెచ్‌ఎం) జాన్ ఉద్దేశపూర్వకంగా విద్యార్థులతో డ్రామా ఆడించి భోజనాన్ని చెత్తబుట్టలో పారేయించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆ పాఠశాలను సందర్శించారు. పర్యటన విషయాన్ని గోప్యంగా ఉంచారు. నేరుగా పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచిచూసి నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వంట ఏజెన్సీ అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనాన్ని బయట పారేసిన రోజు, ఇప్పుడు భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు. భోజనం బాగోకపోతే తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ‘లీప్ యాప్’ ద్వారా తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. భోజనం సిద్ధమయ్యాక రోజుకొక ఉపాధ్యాయుడు నాణ్యతను పరిశీలించాలన్నారు.
భోజనం ఎలా ఉందమ్మా!
‘‘మీకు పెట్టే భోజనం ఎలా ఉందమ్మా.’’ అంటూ.. మంత్రి లోకేశ్ చిన్నారులతో మమేకమయ్యారు. ‘‘భోజనం గురించి మీ అమ్మా నాన్నకు చెబుతారా?. అమ్మా నాన్నకు నేను ఫోన్‌చేసి తెలుసుకోవచ్చా.’’ అని ప్రశ్నించారు. దీనికి విద్యార్థులు.. ‘‘తెలుసుకోవచ్చు సార్.. ఈ రోజు బాగుంది సార్..’’ అని బదులిచ్చారు. ‘‘మీకు పెట్టే భోజనం బాగుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మీరు మాత్రం బాగా చదవండి.’’ అని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయన కూడా భోజనం రుచి చూశారు.
చిన్నా ప్లేటు తీసుకురా..!
‘‘చిన్నా ప్లేటు తీసుకురా.. ఇది నీ ప్లేటా!’’ అని అడిగి అందులోనే భోజనం చేసి మరలా శుభ్రంగా ఆ ప్లేటును కడిగి ఆ విద్యార్థికి అందించారు మంత్రి లోకేశ్. తద్వారా విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామానగర్‌లోని పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మధ్యాహ్న భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు ఒక విద్యార్థిని ప్లేటును అడిగి తీసుకున్నారు. నిర్వహకురాలు భోజనం వడ్డిస్తుండగా వద్దు వద్దు నేనే వడ్డించుకుంటానంటూ తానే స్వయంగా వడ్డించుకొని భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. అనంతరం, ఆ ప్లేటును స్వయంగా కడిగి ఆ విద్యార్థికి తిరిగి అప్పగించారు.