Minister Lokesh: ‘టీమ్ 11’ ముఖం చూసి.. ఎవరొస్తారు?
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:54 AM
అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబు మాత్రమేనని, ఆయన విజన్ సాధనకు తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే గుర్తు వచ్చేది చంద్రబాబే!
ఆయన విజన్ సాధనకు అహర్నిశలు కృషి
18 నెలల్లో 23 లక్షల కోట్ల ఎంవోయూలు
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేశ్
ఏపీలో టీం 11 ఉంది. అర్థమైందా రాజా? అదో ఏడుపు గొట్టు టీం. పెట్టుబడులు తీసుకొస్తామంటే ఏడుస్తారు. ఏ మంచి చేసినా ఏడుస్తారు. చంద్రబాబును చూసి రాష్ట్రానికి కంపెనీలు వస్తే, క్రెడిట్ మాత్రం ఏడుపుగొట్టు టీం తీసుకోవాలని అనుకుంటుంది. టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? క్రెడిట్ చోరీ అంటూ టీం 11 గగ్గోలు పెడుతోంది. వారికి కోడికత్తి క్రెడిట్ ఇవ్వాలి.. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి.. చెల్లినీ, తల్లినీ గెంటేసిన క్రెడిట్ ఇవ్వాలి.
-మంత్రి లోకేశ్
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబు మాత్రమేనని, ఆయన విజన్ సాధనకు తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన మంత్రి లోకేశ్ జ్యూరిక్‌లో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు, నేను ఏ దేశానికి వెళ్లినా ముందు తెలుగు వారిని కలుస్తున్నాం. ఆ తర్వాతే అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నాం. గత ఏడాది ఏపీ గ్రోత్ స్టోరీ ఇక్క డే ప్రారంభమైంది. అప్పటి నుంచి తిరుగు లేకుండా సాగిపోతోంది. 18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టు బడులు ఏపీకి వచ్చాయి. వీటి ద్వారా 16 లక్షలకుపైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.
పెట్టుబడుల్లో ఇప్పుడు ఏపీ నంబర్ 1. ఈ రోజు ఏపీకి ఇన్ని పెట్టుబడులు.. ఇంత మం ది పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్.. యూనిక్ పీస్. చంద్రబాబును మనమంతా బ్లైం డ్‌గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించినా..హైటెక్ సిటీ కట్టినా..శంషాబాద్ ఎయిర్‌పోర్టు కట్టినా.. అమరావతి కట్టినా అనేక మంది విమర్శలు చేస్తుంటారు. చివరికి చంద్రబాబు చేసిన పనులతో వారూ ఫలితాలు అనుభవిస్తారు’’ అని తెలిపారు. లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు జీపీఎస్.. మేమంతా మిస్సైళ్లం
‘‘గతంలో కోడిగుడ్డు మంత్రిని దావోస్ ఎందుకు వెళ్లలేదంటే బాగా చలిగా ఉంటుందని, అందుకే వెళ్లలేదన్నారు. 75 ఏళ్ల వయసులో చలిని లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు. మేమంతా మిస్సైళ్ల లాంటి వారం. చంద్రబాబు జీపీఎస్ లాంటి వారు. మిస్సైల్‌కు జీపీఎస్ లేకపోతే ప్రమాదకరం.’’
ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం
‘‘అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. ప్రభుత్వం కొనసాగింది కాబట్టే గు జరాత్, ఒడిశా లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. పవనన్న చెప్పినట్లు కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు ఉండాలి. రాజధాని కేంద్రీకరణ- అభివృద్ధి వికేంద్రీకరణ మా అజెండా. ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లు. మీలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మీరంతా ఏపీ లో పెట్టుబడులు పెట్టండి. మీరు పనిచేసే కంపెనీలకు విస్తరణ ఆలోచన ఉంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సూచనలు చేయండి’’ అని లోకేశ్ కోరారు.