చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగాలి
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:36 AM
వైసీపీ రాజకీయ కక్షకు బలైపోయిన మాచర్లకు చెందిన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చంద్రయ్య కుమారుడికి జూనియర్...
ఆయన కుమారుడికి ఉద్యోగం ఇస్తామంటే అడ్డుకున్నారు
జై టీడీపీ అన్నందుకు చంపేశారు: అసెంబ్లీలో లోకేశ్
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాజకీయ కక్షకు బలైపోయిన మాచర్లకు చెందిన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చంద్రయ్య కుమారుడికి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబరులో నియామకాల సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించి శానస మండలికి పంపింది. అక్కడ బిల్లుకు ఆమోదం లభించలేదు. వంద రోజుల గడువు దాటిపోవడంతో సవరణ బిల్లును మంత్రి లోకేశ్ బుధవారం మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మంత్రి మాట్లాడుతూ ‘ఈ బిల్లును శాసన మండలిలో ఆమోదం పొందకుండా కావాలని అడ్డుకున్నారు. చంద్రయ్య బీసీ నాయకుడు. జై జగన్ అనకుండా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నాడని నడిరోడ్డుపై కిరాతకంగా గొంతుకోసి చంపేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని టీడీపీ, కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అన్యాయంగా హత్యలకు గురయ్యేవారికి న్యాయం చేయాలని ఈ బిల్లు తీసుకొచ్చాం. ఉపముఖ్యమంత్రి పవన్ అన్న కూడా ఉద్యోగం ఇవ్వడాన్ని సమర్థించారు’ అని అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి కేసుల నేపథ్యం లేని సాధారణ కార్యకర్తను అన్యాయంగా చంపేశారన్నారు. అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏపీ అగ్నిమాపక సేవా చట్టం-1999కి అసెంబ్లీ సవరణలు చేసింది. సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చట్ట సరరణ వల్ల 21 నుంచి 30 రోజుల్లో ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు అందుతాయన్నారు. ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. చిన్నపాటి నేరాలకు జైలు శిక్ష విధించే చట్టాలను అసెంబ్లీ సవరించింది. చిన్న నేరాల ను నేర రహితం, హేతుబద్ధం చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన జన విశ్వాస్ చట్టం-2023కు అనుగుణంగా ఏపీ జన్ విశ్వాస్ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం స్వల్ప నేరాలకు జైలు శిక్షల బదులు.. పెద్ద జరిమానాలు విధిస్తారు. ఉదాహరణకు ఎక్సైజ్ చట్టం ప్రకారం ఉన్న తాటిచెట్లు నరకడం లాంటి చర్యలకు జరిమానాతో సరిపెడతారు. దీనివల్ల కోర్టులపై కూడా భారం తగ్గుతుంది.