ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉపయోగించుకోండి
ABN , Publish Date - May 23 , 2026 | 06:21 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌తో ఎంఎస్ఎంఈలకు ఎంతో ప్రయోజనమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు
పరిశ్రమల యాజమాన్యాలకు మంత్రి కొండపల్లి పిలుపు
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌తో ఎంఎ్‌సఎంఈలకు ఎంతో ప్రయోజనమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాల వల్ల నెలకొన్న తాజా పరిస్థితుల్లో దేశంలోని పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ తీసుకువచ్చిందని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానంలో గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందన్నారు. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలకు 100 శాతం, నాన్ ఎంఎస్ఎంఈ రంగాలకు 90 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ కవరేజీ ఇస్తుందన్నారు. ఈ పథకం కింద ఒక్కో రుణ గ్రహీత గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకు అదనపు రుణం పొందే అవకాశం ఉందన్నారు. ఈ పథకం ద్వారా రుణాలు పొంది ఎంఎ్‌సఎంఈలను పటిష్ఠం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి సూచించారు.