Share News

‘ఆడబిడ్డ నిథి’ పథకంపై మండలిలో సంవాదం

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:47 AM

ఆడబిడ్డ నిధి పథకంపై శాసనమండలిలో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య సంవాదం జరిగింది.

‘ఆడబిడ్డ నిథి’ పథకంపై మండలిలో సంవాదం

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డ నిధి పథకంపై శాసనమండలిలో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య సంవాదం జరిగింది. ఈ పథకం కింద 2024-26 మధ్య ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత? అని వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సమాధానం ఇస్తూ, ఈ పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. లబ్ధిదారుల సంఖ్య, నిధుల ఖర్చుపై వైసీపీ సభ్యులు ప్రశ్నించగా, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. దీంతో.. సూపర్‌సిక్స్‌ హామీల్లో ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో కూటమి వాగ్దానం చేసిందని, రెండేళ్లలో రూ.36 వేలు ఆడ బిడ్డలకు ప్రభుత్వం బకాయి పడిందని, ఆ సొమ్ము ఎప్పుడిస్తారని వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రశ్నించారు. దీంతో వాకౌట్‌ చేసి వెళ్లండంటూ టీడీపీ సభ్యులు ఎద్దేవా చేశారు. మంత్రి కొలుసు పార్ధసారథి జోక్యం చేసుకుని.. మీ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు ఎంతిచ్చారో చెప్పాలన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పాలని చైర్మన్‌ మోషేన్‌రాజు సూచించారు. సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు చేస్తున్నామని, ఆడబిడ్డ నిధి పథకం పరిశీలనలో ఉందని మంత్రి శ్రీనివాస్‌ చెప్పారు. దీంతో వైసీపీ, టీడీపీ సభ్యులు పెద్దగా కేకలు వేస్తుండగా.. ప్రతిపక్షానికి, పాలక పక్షానికి తేడా లేకుండా పోతోందని చైర్మన్‌ చురకలేశారు. వైసీపీ వాళ్లకి సమాధానం వినే ఓపిక లేదని టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ అనడంతో ‘ఓపిక మీకూ లేదు.. వాళ్లకీ లేదు’ అని చైర్మన్‌ అన్నారు. అంతకుముందు భోగాపురం విమానాశ్రయం పనులపై వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి జనార్ధన్‌రెడ్డి సమాధానం చెప్తుండగా, భోగాపురం పనులు వైసీపీ హయాంలో జరిగితే కూటమి నేతలు హైజాక్‌ చేశారని వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో భోగాపురానికి ఎర్ర బస్సే రాదని జగన్‌ అన్నారుగా అని టీడీపీ సభ్యులు ఎద్దేవా చేశారు.


పలు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు: ఏపీ అల్లోపతి ప్రైవేట్‌ వైద్య సంరక్షణ సంస్థల రిజిస్ర్టేషన్‌, రెగ్యులేషన్‌ సవరణ బిల్లును మంత్రి సత్యకుమార్‌, ఏపీ ధార్మిక, హిందూ మత సంస్థలు, దేవాదాయ సవరణ బిల్లు, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, ఏపీ రైతుల నీటి పారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ బిల్లును మంత్రి పార్ధసారఽథి, ఏపీ జైళ్లు, సంస్కరణ సర్వీసుల బిల్లును మంత్రి అనిత ప్రవేశపెట్టారు. వ్యవసాయంపై లఘుచర్చ వాయిదా పడింది.

Updated Date - Feb 26 , 2026 | 04:47 AM