Share News

అబద్ధాల ప్రచారంపై చర్యలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:29 AM

ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేసే వారిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

అబద్ధాల ప్రచారంపై చర్యలు

  • వైసీపీకి ఓట్లేసిన 40శాతం మందికీ జగన్‌ వెన్నుపోటు: మంత్రి కొలుసు

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేసే వారిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి... కూటమి రెండేళ్ల పాలనపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పోడించిందని చెప్పే ప్రతిపక్ష వైసీపీ నేతలు.. వారికి ఓట్లేసిన 40శాతం మందికీ వెన్నుపోటు పొడిచారు. అధికారంలో ఉంటే మేలు చేస్తారని, ప్రతిపక్షంలో ఉంటే... ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించి, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారనే నమ్మకంతో వాళ్లకి ఓట్లేసిన జనానికి వెన్నుపోటు పోడిచారు. ‘మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటు అడగను’ అన్న జగన్‌రెడ్డి... ‘ఆర్థిక పరిస్థితుల కారణంగా మాట నిలబెట్టుకోలేకపోయా’ అని అంటే ప్రజలు ఎలా ఆలోచించించే వారో? కానీ జగన్‌ తన స్వార్థం కోసం మద్యంపై ఆదాయాన్ని 20 ఏళ్లు తాకట్టు పెట్టి, ఆరోగ్యం చెడిపోయే మద్యాన్ని ప్రజలతో తాగించారు. అధికారంలోకి రాలేని వారు ఏదైనా చెప్పొచ్చు కానీ అబద్ధాలతో రాజకీయాలు చేయడం బాధ్యతగల పార్టీలు, నాయకులు చేయకూడదు. ప్రతిపక్ష నేతలు ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే.. ఒలంపిక్స్‌ అథారిటీ, కేంద్రం ఆమోదించిన క్రీడలను కూడా వాళ్ల బుద్ధికి తగ్గట్టు కించపర్చేలా మాట్లాడారు. వీటి అన్నింటినీ చూసి వెన్నుపోటు ఎవరు పొడిచారో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆదరించి, అనుసరిస్తుంటే.. ఇక్కడి నాయకులు ఎందుకూ ఉపయోగపడని ఒక కట్టడంతో పోల్చడం బాధాకరం. సీపీఎస్‌, ఉద్యోగులకు 65ఏళ్ల సర్వీసు పెంపుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టులో 21 పోస్టులను మంజూరు చేయడంతో పాటు క్యాబినెట్‌ సబ్‌కమిటీ వేసి, ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Jun 05 , 2026 | 05:29 AM