Share News

వైసీపీ మనుగడ విధ్వంసం, హత్యలపైనే!

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:36 AM

రాష్ట్ర రాజకీయ ప్రతిష్ఠను వైసీపీ అథఃపాతాళానికి తొక్కేసిందని, నాడు వివేకానందరెడ్డిని.. నేడు పెద్ద దస్తగిరిని హత్య చేసి తన రక్తచరిత్రను మరోసారి ప్రజలకు గుర్తు చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

వైసీపీ మనుగడ విధ్వంసం, హత్యలపైనే!

  • హంతకులే బాధితుల వద్దకు వెళ్లి కన్నీరు కార్చడమా: మంత్రి కొలుసు

  • దస్తగిరి రియల్‌ వ్యాపారి కాదు అవినాశ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డికి బినామీ: పార్థసారథి

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయ ప్రతిష్ఠను వైసీపీ అథఃపాతాళానికి తొక్కేసిందని, నాడు వివేకానందరెడ్డిని.. నేడు పెద్ద దస్తగిరిని హత్య చేసి తన రక్తచరిత్రను మరోసారి ప్రజలకు గుర్తు చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆ పార్టీ మనుగడ మొత్తం విధ్వంసం.. హత్యలపైనే సాగుతోందని విమర్శించారు. హంతకులే బాధితుల వద్దకు వెళ్లి మొసలికన్నీరు కార్చడం అత్యంత హేయమైన చర్యని ధ్వజమెత్తారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘నాడు వివేకా హత్యను గొడ్డలిపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు.. తాజాగా పెద్దదస్తగిరి హత్యను కూడా గంజాయు బ్యాచ్‌ గొడవల్లో జరిగిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు దస్తగిరి వంటి వారిని వాడుకుని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. దస్తగిరి నివాసంలో పోలీసుల సోదాల్లో ప్రాథమికంగా రూ.150 కోట్ల విలువైన ప త్రాలు దొరికినట్లు తెలిసినా.. లోతుగా పరిశీలిస్తే వాటి విలువ రూ.500 కోట్ల వరకు ఉండొచ్చు. అతడు సాధారణ రియల్‌ వ్యాపారి కాదు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి బినామీ. తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలతోనూ దస్తగిరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ రాజకీయాల్లో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. రాత్రి చీకట్లో హత్యలు చేయించి, తెల్లారేసరికి ఏమీ తెలియనట్లు శవాల దగ్గర నివాళులర్పించి మొసలికన్నీరు కార్చడం వారికి అలవాటే.


దస్తగిరి హత్యలో ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే.. అతడి భౌతికకాయం సందర్శనకు వెళ్లడం, కుటుంబాన్ని పరామర్శించడం అత్యంత ఘోరం. దస్తగరి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడి పేరుతో 30, భార్య, కుమార్తె, అల్లుడు పేరుతో మరో 30కిపైగా డాక్యుమెంట్లు ఉన్నాయి. దస్తగిరి ఎవరికి బినామీయో.. అతడిని చంపాల్సిన అవసరం ఎవరికి, ఎందుకు వచ్చిందో దీనిని బట్టే అర్థమవుతోంది. అతడి హత్య వెనుక కచ్చితంగా వైసీపీపెద్దల హస్తం ఉంది. నాడు వివేకా హత్య కేసులో ఏవిధంగా మభ్య పెట్టారో.. నేడు దస్తగిరి హత్య విషయంలోనూ వైసీపీ నాయకులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని పిలుపిచ్చారు.

Updated Date - Apr 22 , 2026 | 05:36 AM