Share News

ఉగాదికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:57 AM

‘పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లగలరా? లేదా? మీరు చేయలేకపోతే చెప్పండి.. డిపార్ట్‌మెంట్‌ను మూసేసి ఏ ఇంజనీరింగ్‌ శాఖలోనో విలీనం చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఉగాదికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలి

  • సాకులు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు: మంత్రి కొలుసు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లగలరా? లేదా? మీరు చేయలేకపోతే చెప్పండి.. డిపార్ట్‌మెంట్‌ను మూసేసి ఏ ఇంజనీరింగ్‌ శాఖలోనో విలీనం చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇలాగే పనిచేస్తామంటే మాత్రం ఇక మీ భవిష్యత్తును ముఖ్యమంత్రే డిసైడ్‌ చేస్తారు’ అంటూ గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. శుక్రవారం విజయవాడలోని గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల హౌసింగ్‌ హెడ్‌లు, డివిజినల్‌ హెడ్‌లతో మంత్రి కొలుసు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పలు జిల్లాల పీడీలు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కొలుసు స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికి 15 వేల ఇళ్లు నిర్మించారు. ఇంకా దాదాపు 13వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. వీటిని ఈ ఏడాది సెప్టెంబరులోగా పూర్తిచేయకపోతే రూ. వేల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇప్పటివరకు కట్టిన ఇళ్లు నివాసయోగ్యంగా లేకపోతే మరి వాటిని ఏం చేయాలి? స్థలం, ఇళ్లు, సదుపాయాలతో కలిపి దాదాపు రూ.30వేల కోట్ల వరకు ఖర్చు చేశారు.


సమస్యలున్నాయని సాకులు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదు. కాలనీలకు లబ్ధిదారులను తీసుకువచ్చే బాధ్యత మీదే. వారిని కట్టిన ఇళ్లలో నివాసం ఉండేలా ఒప్పించండి. అంగీకరించని వారిని ఆ ఇళ్లు వద్దని రాసి ఇవ్వమనండి. వాటిని మిగతా పేదలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’ అని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే వదిలేసిపోయిన కాంట్రాక్టర్లపై కేసులు పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఇళ్లు కట్టడానికి ముందుకొచ్చే కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:58 AM