Share News

Minister Kollu Ravindra: వైసీపీ దోపిడీకి అడ్డాలుగా మైనింగ్‌, ఎక్సైజ్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:43 AM

గత వైసీపీ ప్రభుత్వం మైనింగ్‌, ఎక్సైజ్‌ శాఖలను... ముఖ్యంగా ఇసుకను దోపిడికి అడ్డాగా మార్చింది. రూ.3,300 కోట్లు అవినీతికి పాల్పడింది...

Minister Kollu Ravindra: వైసీపీ దోపిడీకి అడ్డాలుగా మైనింగ్‌, ఎక్సైజ్‌

  • ప్రజలకు ఇసుక ఇవ్వకుండా జగన్‌ ఇబ్బంది పెడితే... చంద్రబాబు ఉచిత ఇసుకతో వారికి అండగా ఉన్నారు

  • రాష్ట్రంలో 25.21 లక్షల టన్నుల ఇసుక వినియోగం

  • అందులో 10.98 లక్షల టన్నులు గోదావరి ఇసుకే

  • మరిన్ని ర్యాంపులు సిద్ధం చేస్తున్నాం

  • ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1.50 కోట్ల టన్నులఇసుక డ్రెడ్జింగ్‌కు ప్రయత్నాలు

  • ఎంఆర్‌పీకే మద్యం... బెల్టుకు ససేమిరా

  • 35ు నుంచి 40ు డిజిటల్‌ పేమెంట్లే: మంత్రి కొల్లు

రాజమహేంద్రవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వం మైనింగ్‌, ఎక్సైజ్‌ శాఖలను... ముఖ్యంగా ఇసుకను దోపిడికి అడ్డాగా మార్చింది. రూ.3,300 కోట్లు అవినీతికి పాల్పడింది’ అని మంత్రి కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌లో మైనింగ్‌, ఎక్సైజ్‌ శాఖల పనితీరుపై సమీక్షించిన అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివా్‌సతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్నీ డిజిటల్‌ పేమెంట్లే చేయాలని ఈరోజు ఆదేశించాం. ఇప్పటికే 35 నుంచి 40 శాతం జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో శత శాతం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడా లిక్కర్‌ ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మకూడదు. బెల్ట్‌ షాపులు కూడా పెట్టకూడదు. మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం సంఘటన నేపథ్యంలో సురక్ష యాప్‌ తీసుకొచ్చాం. లిక్కర్‌ బాటిల్‌ను అందులో స్కాన్‌ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిపోతాయు. రూ.99కే మంచి క్వాలిటీ బ్రాండ్లు అందుబాటులో ఉండడం వల్ల బీరు అమ్మకాలు పడిపోయాయి. కాకినాడలో అత్యాధునిక ల్యాబ్‌ ఏర్పాటు చేశాం. ఇక్కడ లిక్కర్‌కు సంబంధించి 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. సారా నిరోధించడంలో నవోదయంతో 100 శాతం విజయవంతమయ్యాం. ఇక్కడ 14 పీడీ కేసులు పెట్టాం. ఇంకా ఎవరైనా సారా తయారీకి ప్రయత్నిస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తాం. గతం నుంచి సారా తయారీపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపిస్తున్నాం. ఇప్పటికే పశ్చిమగోదావరిలో మొదలు పెట్టాం. త్వరలో మిగతా చోట్ల కూడా అమలు చేయనున్నాం. గత వైసీపీ ప్రభుత్వం గంజాయిని ఆదాయ మార్గంగా మార్చుకుంటే మేం ఈగ ల్‌ టీమ్‌ను పెట్టి గంజాయి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదు. వైసీపీ ఇసుక దోపిడీ చేసి, ప్రజలకు ఇసుక లేకుండా చేసి, భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది.


కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయం కూడా లెక్కచేయకుండా ఉచిత ఇసుక విధానం తెచ్చి, కార్మికులకు, ప్రజలకు అండగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 25.21 లక్షల టన్నుల ఇసుక వినియోగిస్తే అందులో 10.98 లక్షల టన్నుల ఇసుక గోదావరిదే. ఇసుక ర్యాంపులను పెంచుతున్నాం. డీసిల్టేషన్‌, ఓపెన్‌ ర్యాంపులు, పట్టా భూముల్లో కూడా ఇసుక తీస్తున్నాం. ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ ఇసుక తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉచిత ఇసుక వల్ల విశాఖలో ప్రస్తుతం టన్ను రూ.500 నుంచి రూ.700కే లభ్యమవుతుంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఇసుక మేటలు తొలగిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందనే ఆలోచనతో ఇరిగేషన్‌ అధికారులు అక్కడ 1.50 కోట్ల టన్నుల ఇసుక తీయడానికి ప్రతిపాదించారు. దీనిని డ్రెడ్జింగ్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం కృష్ణా నదిలో డ్రెడ్జింగ్‌ చేస్తున్నాం. రోడ్డు మెటల్‌, క్రిటికల్‌, మైనర్‌ మినరల్‌ వంటి వాటిని గుర్తిస్తున్నాం. ఎప్పటికప్పుడే అనుమతులు ఇస్తూ అవినీతికి తావు లేకుండా చేయడంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం. గతంలో కేసుల్లో ఉన్న వాటికి రూ.కోట్లు ఫైన్‌ వేసి, పరిష్కరిస్తున్నాం. వైసీపీది పనికిమాలిన బుద్ధి. వాళ్లు మారరు. బతుకులు మారవు. తప్పుడు కేసులతో మా వాళ్లను రాజమండ్రి జైలులో పెట్టి ఆనందించారు. ప్రజలు చీకొట్టినా, నీచ రాజకీయాలు మానడం లేదు. ఇక వాళ్ల ఆటలు సాగనిచ్చేది లేదు’ అని మంత్రి రవీంద్ర హెచ్చరించారు.

Updated Date - Jan 07 , 2026 | 02:43 AM