Minister Kollu Ravindra: పల్నాడు గొడవల్ని రాజకీయం చేయడం దారుణం
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:55 AM
పల్నాడులో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను రాజకీయం చేయడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
అభివృద్ధిని సహించలేకే వైసీపీ బురద చల్లే ప్రయత్నం: మంత్రి కొల్లు
మచిలీపట్నం టౌన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పల్నాడులో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను రాజకీయం చేయడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హత్యారాజకీయాలకు, కక్షసాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం దూరమన్నారు. అభివృద్ధిని చూసి సహించలేక వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీషీటర్ల మధ్య వ్యక్తిగత తగాదాలను వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు. జగన్ పాలనలో బీసీ, ఎస్సీ నాయకులను హత్య చేశారని, పిన్నెల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై జగన్ అనుయాయులు దాడులు జరిపించారని చెప్పారు. మద్యం స్కాంలో జోగి రమేశ్ అకృత్యాలు బయటపడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.99కే లిక్కర్ అందిస్తున్నామని, మళ్లీ నాణ్యత కలిగిన బీర్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు.