అంతటి దౌర్భాగ్యం రాష్ట్ర రాజకీయానికి లేదు
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:12 AM
రాజకీయ నాయకుల ప్రవర్తనా నియమావళి, నైతిక విలువల గురించి వైసీపీ నేతల నుంచి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర రాజకీయం లేదు.
వైసీపీ నేతల నుంచి నైతిక విలువలు నేర్చుకోవాల్సిన పనిలేదు
పవన్‌ను కుల చట్రంలోకి నెట్టాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి దుర్గేశ్
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయ నాయకుల ప్రవర్తనా నియమావళి, నైతిక విలువల గురించి వైసీపీ నేతల నుంచి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర రాజకీయం లేదు. రాజకీయాల్లో విలువల్లేని వ్యవస్థను పెంచి పోషించిన పార్టీ వైసీపీ మాత్రమే’ అని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మంగళవారం ఆయన అమరావతి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్, నాటి సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలని చేసిన వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ‘అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వంటి నేతలు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాతృమూర్తిపై చేసిన వ్యక్తిగత, అసభ్యకర దూషణలను ప్రజలు మర్చిపోలేదు. సాయికృష్ణ అదృశ్యం కేసులో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. నిందితుడైన సీఐ నాగరాజును సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ కేసును అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు కులాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాజంలో విభజన తేవాలని చూస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందడమే ధ్యేయమన్న స్థాయికి వైసీపీ దిగజారిపోయింది. పవన్ కల్యాణ్‌ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ప్రజలు క్షమించరు. 2019-24 మధ్యకాలంలో కాపు కార్పొరేషన్‌కు ఎంత నిధులు కేటాయించారో, ఎంతమంది కాపు యువతకు విదేశీ విద్యకు సహాయం చేశారో, కాపు భవనాలకు ఎంత నిధులు ఇచ్చారో డేటా ఉంటే చూపించాలి. నాడు సామర్లకోటలో జగన్ పర్యటన సందర్భంగా కాపులకు ఈడబ్ల్యూఎస్ వర్తింపచేయనని చెబితే నోరుమెదపని వైసీపీ కాపు నేతలు నేడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు’ అని దుర్గేశ్ ధ్వజమెత్తారు.