Share News

రాష్ట్రంలో కుల, మత ఘర్షణలకు కుట్రలు!

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:49 AM

నటుడు ప్రకాశ్‌ రాజ్‌, యూట్యూబర్‌ జోసెఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ల ద్వారా రాష్ట్రంలో భారీగా కుల, మత ఘర్షణలు జరిపే కుట్ర జరుగుతోందని జనసేన సీనియర్‌ నేత, మంత్రి కందుల దుర్గేశ్‌ అనుమానం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కుల, మత ఘర్షణలకు కుట్రలు!

  • పాత్రధారులుగా ప్రకాశ్‌ రాజ్‌, ప్రశ్న రావణ్‌

  • కుట్రదారుల నుంచి వీరిద్దరికీ ఫండింగ్‌

  • చలి కాచుకునేందుకు సిద్ధంగా ‘తాడేపల్లి ప్యాలెస్‌’

  • అన్ని సంగతులూ బయటపెడతాం: మంత్రి దుర్గేశ్‌

  • ఇద్దరి ఆడియో సంభాషణలు విడుదల

విజయవాడ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నటుడు ప్రకాశ్‌ రాజ్‌, యూట్యూబర్‌ జోసెఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ల ద్వారా రాష్ట్రంలో భారీగా కుల, మత ఘర్షణలు జరిపే కుట్ర జరుగుతోందని జనసేన సీనియర్‌ నేత, మంత్రి కందుల దుర్గేశ్‌ అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయవాడలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్‌ రాజ్‌, రావణ్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఇదేనంటూ ఒక ఆడియో లీక్‌ను విడుదల చేశారు. ‘ఇది మీ మాటలు కావనే దమ్మూ ధైర్యం ఉన్నాయా?’ అని ఆ ఇద్దరినీ ప్రశ్నించారు. ‘‘ప్రకాశ్‌ రాజ్‌, ప్రశ్న రావణ్‌ల ద్వారా అల్లర్లకు కుట్ర జరుగుతోంది. కుట్రదారుల నుంచి వీరికి భారీ మొత్తంలో నెల నెలా దండిగా ఫండ్‌ అందుతోంది. కుట్రదారులు, పాత్రధారుల వల్ల మత ఘర్షణలు తలెత్తితే, ఆ మంటల్లో చలి కాచుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్‌ కాచుకుని కూర్చుంది’’ అని దుర్గేశ్‌ మండిపడ్డారు. ఇప్పుడు ఆడియోను బయటపెట్టామని, త్వరలో కుట్రదారుడి కుతంత్రాలనూ బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘జస్ట్‌ ఆస్కింగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో గొంతు చించుకునే ప్రకాశ్‌ రాజ్‌, మత ఘర్షణలు సృష్టించేలా మాట్లాడే రావణ్‌ల నడుమ అపవిత్ర బంధం ఉందని తేలింది. ఇరువురూ కలిసి వ్యూహాత్మకంగా కూటమి ప్రభుత్వంపైన, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పైనా అవాకులు చవాకులు పేలుతూ హిందూ ధర్మంపై దాడి చేసేలా మాట్లాడటం సమర్థనీయమా? ‘‘జాతీయవాదం, సనాతన ధర్మాల గురించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన సందర్భాల్లో ప్రకాశ్‌ రాజ్‌, రావణ్‌లు సోషల్‌ మీడియా వేదికగా మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. ఇందులో పవన్‌ను బలహీనపరచాలనే కుట్ర కనిపిస్తోంది.


ఆ ఇద్దరి భావజాలం, ఆశయం, లక్ష్యం ఒకటే! సంఘ వ్యతిరేక శక్తుల కన్నా హీనంగా వ్యవహరిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌, రావణ్‌లు... దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌, దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మరణాల గురించి జస్ట్‌ ఆస్కింగ్‌ అని ఎందుకు అడగలేదు? కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం, వైసీపీ ఆగడాలను ప్రశ్నించకపోవడమే మీ సిద్ధాంతమా? ఇటువంటి కిరాయి మూకల మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈ సంఘ వ్యతిరేక శక్తుల వెనుక ఉన్న సూత్రధారులు, స్ర్కిప్ట్‌ రైటర్స్‌, ఫైనాన్సియర్లను అతి త్వరలో చట్టం ముందు నిలబెడతాం’’ అని దుర్గేశ్‌ స్పష్టం చేశారు.


ఇదీ ఆ ఆడియో లీక్‌..

ప్రకాశ్‌ రాజ్‌: దీనికి కౌంటర్‌ ఇవ్వాలి. మేము గొర్రెలం కాదు.. బానిస బతుకు బతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారూ! ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా.. నేనే నాయకుడు అనుకున్న వాడైనా.. సమాధానమివ్వాల్సిన బాధ్యత ఉంది. అర్థమైందా? జస్ట్‌ ఆస్కింగ్‌.

బండెక్కి పారిపోయిన వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదు రేవంత్‌ రెడ్డి గారు అని ట్వీట్‌ చేయొచ్చా నాకు తెలీదు.

రావణ్‌: కొందరు అమ్ముడుపోయిన మీడియా అంటే అది తప్పుడు పదం అవుతుంది సార్‌. కొందరికి అమ్ముడు పోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు.. కొందరు మనుషులకు కావచ్చు! కొందరికి అమ్ముడుపోయిన మీడియా అని పెట్టండి సార్‌.

ప్రకాశ్‌ రాజ్‌: నిజం తెలుసుకోవాలన్న ప్రజలకు, నిజం తెలుసుకోవాలనుకుంటున్న మీడియా మిత్రులకు, ఇంకా కొందరికి అమ్ముడు పోయిన మీడియాకు... ఓకే!

రావణ్‌: సార్‌... మీకొక లింక్‌ పంపిస్తాను. యూట్యూబ్‌ లింక్‌. దానిమీద జస్ట్‌ క్లిక్‌ చేస్తే డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోకి వెళ్లిపోయి జాయిన్‌ అనే బటన్‌ చూపిస్తుంది. అది క్లిక్‌ చేస్తే లైవ్‌లోకి వచ్చేస్తారు. మీరు 7.45 గంటలకు వస్తే 8.45 - 9 గంటల వరకు మనం చేసి వూ విల్‌!

ప్రకాశ్‌ రాజ్‌: ఆ లింకు నువ్వు నాకు మెయిల్‌లో పంపిస్తే నేను ఐప్యాడ్‌లో ఓపెన్‌ చేస్తా అంతేకదా! లేదా ఫోన్‌లో ఓపెన్‌ చేయాలా.. దట్స్‌ ఐ వాంట్‌ టూ నో! దానికి గంట ముందు ఐ విల్‌ టాక్‌ టూ యూ.

Updated Date - Jul 05 , 2026 | 04:52 AM