సబ్‌స్టేషన్లు ఎప్పట్లోగా పూర్తి చేస్తారు?
ABN , Publish Date - May 26 , 2026 | 05:44 AM
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సబ్‌స్టేషన్ల నిర్మాణంలో జాప్యంపై విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాప్యంపై ట్రాన్స్‌కో అధికారులపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సబ్‌స్టేషన్ల నిర్మాణంలో జాప్యంపై విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విద్యుత్తు శాఖ అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఓవర్‌లోడ్ కారణంగా సబ్‌స్టేషన్లలో తరచూ అంతరాయాలు ఏర్పడి విద్యుత్తు సరఫరా నిలిచిపోతుండటంపై మంత్రి ఆరా తీశారు. 132, 220, 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాల్లో జాప్యం ఎందుకు ఏర్పడుతుందో.. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తనకు తెలియజేయాలని ఆదేశించారు. అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు మూడు డిస్కంల పరిధిలో 1912 కాల్ సెంటర్‌ను యాక్టివేట్ చేయాలని, విద్యుత్తు అంతరాయాలను వేగవంతంగా పరిష్కరించేందుకు కాల్‌సెంటర్లలో అవసరమైన లైన్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.