అట్టడుగు వర్గాల సాధికారతే లక్ష్యం
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:51 AM
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అట్టడుగు వర్గాల సమగ్ర సాధికారత అనే మహత్తర లక్ష్యాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో..
స్వర్ణ గ్రామ, వార్డ్ వ్యవస్థలతో సంస్కరణలు
గురుకులాలు, హాస్టళ్లలో రికార్డు స్థాయి ఫలితాలు
విద్యార్థుల ఆరోగ్యభద్రతకు ప్రత్యేక కార్యాచరణ
రెండేళ్ల సంక్షేమ అభివృద్ధిని వెల్లడించిన మంత్రి డోలా
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అట్టడుగు వర్గాల సమగ్ర సాధికారత అనే మహత్తర లక్ష్యాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పరిపాలనకు కొత్త దిశను నిర్దేశిస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చెప్పారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో రెండేళ్లలో సాంఘిక సంక్షేమ శాఖలో సాధించిన విజయాలపై మంత్రి విలేకరుల సమావేశంలో వివరించారు. సమాజంలో విద్యా సాధికారతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తోందన్నారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షి్‌పల కింద రూ.1543 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసి 5.40 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చామని చెప్పారు. ప్రీమెట్రిక్ విద్యార్థులకు తల్లికి వందన కార్యక్రమం ద్వారా రూ.326 కోట్లను 2.51 లక్షల మందికి అందించామన్నారు. నీట్, జేఈఈ, సివిల్స్, గ్రూప్స్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. డీఎస్సీ కోచింగ్ ద్వారా 2 వేల మంది శిక్షణ ఇస్తే, అందులో 331 మంది ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని అంబేడ్కర్ గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని మంత్రి తెలిపారు. టెన్త్‌లో 85.32 శాతం, ఇంటర్మీడియట్‌లో 72.30 శాతం ఫలితాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రత్యేకంగా గురుకులాల్లో టెన్త్‌లో 89 శాతం, ఇంటర్మీడియట్‌లో 92 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. ఇంటర్మీడియట్‌లో 950కు పైగా మార్కులు 45 మంది విద్యార్థులు సాధించగా, టెన్త్‌లో 591 మార్కులు సాధించిన విద్యార్థి హాస్టల్ నుంచే రావడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శమన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు, ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లోనూ విద్యార్థులు రాణించేలా 14 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
రూపుమారిన హాస్టళ్లు
హాస్టల్ విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన, వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రూ.104 కోట్లతో హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి 774 హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. 989 హాస్టళ్లలో రూ.19.80 కోట్లతో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, మెకనైజ్డ్ కిచెన్లతో పరిశుభ్రమైన, పోషకాహార భోజనం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి హాస్టల్, గురుకులంలో హెల్త్ సూపర్‌వైజర్లు, నర్సింగ్ సిబ్బందిని నియమించి విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు.
దివ్యాంగుల సంక్షేమంలో...
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 30 లక్షల మందికి సేవలు అందించామని, రూ.13 కోట్లకు పైగా నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. 52,263 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశామని చెప్పారు. 329 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసిన వారికి గౌరవప్రద జీవనోపాఽధి కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
స్వర్ణగ్రామం, వార్డ్ వ్యవస్థ ప్రజలకు చేరువ
స్వర్ణగ్రామం, స్వర్ణవార్డ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 1.68 కోట్ల ఇళ్ల మ్యాపింగ్, 1.71 కోట్ల కుటుంబాల ఈకేవైసీ పూర్తి చేశామని వెల్లడించారు. కాగా, 2024-25 సంవత్సరానికి ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.26044 కోట్లను కేటాయించామని మంత్రి వెల్లడించారు.
మహిళలు, వృద్ధులు, బలహీనవర్గాలకు అండ
ఎన్టీఆర్ భరోసా ఫించన్ల కింద లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్సీ మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం ఉపాధి పథకాలు, సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదంపై రాజకీయాలు సరికాదు: డోలా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి మంత్రులు, అధికారులు అంతా వెళ్లి బాధితులకు భరోసానిచ్చారన్నారు. ప్రమాద కారణాలపై త్రిసభ్య కమిటీ విచారణ చేస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.