మరో 15 వేల టన్నుల శనగల కొనుగోలు
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:12 AM
ఏపీలో శనగ, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అదనంగా కొనుగోలు చేసి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి అచ్చెన్న చొరవతో కేంద్రం అనుమతి
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఏపీలో శనగ, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అదనంగా కొనుగోలు చేసి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి అచ్చెన్న.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఈ ఏడాది శనగ సాగు గణనీయంగా పెరిగి, 7.13లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. ఇప్పటివరకు 94,500 టన్నుల శనగల సేకరణ జరిగింది. మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేసి, రైతుల్ని ఆదుకోవాలి. అందువల్ల శనగల కొనుగోలు లక్ష్యాన్ని 1,78,250 టన్నులకు పెంచాలి’ అని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రమంత్రి స్పందించి, పీఎస్ఎస్ స్కీం కింద అదనంగా 15వేల టన్నుల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. అయితే మిగిలిన 68,750 టన్నుల సేకరణకు చర్యలు తీసుకోవాలని అచ్చెన్న కోరారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రితో చర్చించి, మొక్కజొన్న కొనుగోలుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చౌహాన్ హామీ ఇచ్చారు.