Share News

ఆక్వా రంగంపై జగన్‌వి పచ్చి అబద్ధాలు: మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:40 AM

‘గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలతో జగన్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.

ఆక్వా రంగంపై జగన్‌వి పచ్చి అబద్ధాలు: మంత్రి అచ్చెన్న

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలతో జగన్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆక్వా రంగంపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం గంగూరులోని మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఆక్వా అథారిటీ వైస్‌ చైర్మన్‌ ఆనం వెంకట రమణారెడ్డితో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వంలో ఏపీ ఆక్వా డెవల్‌పమెంట్‌ అథారిటీ చట్టాన్ని తెచ్చామని గొప్పులు చెప్తున్న జగన్‌.. ఆయనే చైర్మన్‌గా ఉండి కూడా ఒక్కసారి కూడా పూర్తి స్థాయి సమావేశం నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెలకు రెండు సమావేశాలు నిర్వహించి, రొయ్యలు, దాణా ధరల నియంత్రణకు ఒక విధానం తెచ్చాం. అమెరికా ఆంక్షలు, ఇరాన్‌ యుద్ధ ప్రభావం ఉన్నా.. ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. వైసీపీ ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇస్తామని చెప్పి, పదెకరాల లోపు ఆక్వా సాగుదారులకే దానిని అమలు చేసింది. జోన్ల నిబంధనలు లేకుండా రూ.1.50కే కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. కొత్త కనెక్షన్లు కూడా మంజూరు చేశాం. గత టీడీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు 25 కేవీ ట్రాన్స్‌ఫారాలు రూ.67 వేలకే ఇవ్వగా, వైసీపీ ప్రభుత్వం దాన్ని రూ.3.24 లక్షలకు పెంచింది. ఫిషరీస్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి, కేవలం బోర్డుకే పరిమితం చేశారు. గత ప్రభుత్వంలో ఆక్వా రంగంలో కేవలం రూ.41.75 లక్షల కోట్ల స్థూల విలువ జోడింపు(జీవీఏ) వస్తే.. ఈ రెండేళ్లలో రూ.63.65 లక్షల కోట్లకు పెరిగింది. ఆక్వా రైతుల సంక్షేమానికి కూటమి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది’ అని మంత్రి అన్నారు.


తొలుత ఆక్వా రైతులు, దాణా కంపెనీలు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, మత్స్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రొయ్యల దాణా ధరలు పూర్తి పారదర్శకంగా ఉండాలని, ముడి సరకుల వాస్తవ ధరలు, నిపుణుల సిఫారసుల ఆధారంగా దాణా ధరలు నిర్ణయించే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చర్యలపై ఎప్పటికప్పుడు ఆక్వా రైతులకు అవగాహన కల్పించి, తప్పుడు ప్రచారానికి తావు లేకుండా చూడాలన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 04:42 AM