16 ఏళ్లయినా, 18 ఏళ్లయినా.. నేరం చేస్తే శిక్ష తప్పదు
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:17 AM
తప్పు చేసింది 16 ఏళ్ల యువకుడైనా, 18 ఏళ్ల యువకుడైనా శిక్ష తప్పదని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కోడికత్తి శ్రీనుకు ఒక న్యాయం..
కోడి కత్తి శ్రీనుకు ఒక న్యాయం.. మాజీ మంత్రి కొడుక్కి ఒక న్యాయమా?
జగన్ తీరుపై మంత్రి అనిత ఆగ్రహం
విజయనగరం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తప్పు చేసింది 16 ఏళ్ల యువకుడైనా, 18 ఏళ్ల యువకుడైనా శిక్ష తప్పదని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కోడికత్తి శ్రీనుకు ఒక న్యాయం.. మాజీ మంత్రి కొడుక్కి ఒక న్యాయమా? అని అని ప్రశ్నించారు. గురువారం ఆమె విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పలాస ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందని తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కొడుకును రక్షించుకోవడానికి పడిన తపన.. ప్రమాదంలో తీవ్రగాయాలు పాలైన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో చూపలేదన్నారు. ‘ఆరవ్ వర్మ పిల్లోడన్నారు.. మరి కోడి కత్తి శ్రీను వయస్సు ఆనాటికి ఎంత? కోడి కత్తి శ్రీనును జైల్లో ఎన్నిరోజులు పెట్టారు. అప్పుడు పాపం పిల్లోడు అని అనిపించలేదా?’’ అని అనిత ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేశ్ వెళ్తే కనీసం ఫొటో కూడా దిగరని, అదే జగన్ వస్తే.. ఊరేగింపులు, .బలప్రదర్శనలు.. జై కొట్టటం ఏంటని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఒక్క మత్స్యకారుడికైనా న్యాయం జరిగిందా? అని నిలదీశారు. ‘‘బోటు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి నేవీ అధికారులను అప్రమత్తం చేసింది. అప్పటికప్పుడు కాకినాడ నుంచి ప్రత్యేక మెరైన్ బోటును తెప్పించి గాలింపు చేపట్టాం. రెండు నేవీ హెలికాప్టర్లతో 72 గంటలపాటు సముద్రాన్ని జల్లెడపట్టాం. మత్స్యకారుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం అందజేసింది’’ అని వివరించారు. 45రోజుల్లో ప్రధాని మోదీ చేతులు మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు.