Share News

టెక్నాలజీతో ‘మొంథా’ను ఎదుర్కొన్నాం

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:15 AM

టెక్నాలజీని ఉపయోగించి మొంఽథా తుఫాన్‌ను ఎదుర్కొన్నామని, సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతో నష్టాన్ని నివారించామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.

టెక్నాలజీతో ‘మొంథా’ను ఎదుర్కొన్నాం

  • అందుకే పంటనష్టం చాలా వరకు తగ్గింది

  • అసెంబ్లీలో హోంమంత్రి అనిత వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీని ఉపయోగించి మొంఽథా తుఫాన్‌ను ఎదుర్కొన్నామని, సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతో నష్టాన్ని నివారించామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, అరిమిల్లి రాధాకృష్ణ, కాగిత కృష్ణప్రసాద్‌ అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. తొలుత రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ చర్యల వల్ల చాలా వరకూ నష్టం తగ్గినప్పటికీ, కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. కాగిత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ పంటనష్టాన్ని చాలా వరకు తగ్గించినా, దిగుబడి తగ్గిందని, చాలామంది నష్టపరిహారం అందలేదని తెలిపారు. దీనిపై మంత్రి అనిత బదులిస్తూ.. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులంతా కలిసి రాత్రి 2 గంటలవరకూ తుఫాన్‌పై పర్యవేక్షణ చేశామని చెప్పారు. 25 జిల్లాల్లో 1.67 హెకార్ట వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టం అంచనాపై ప్రత్యేక టీమ్స్‌ ఏర్పాటు చేశామని, ఇప్పటికే చాలా వరకూ పంట నష్టాన్ని అందించామని, మరికొంత మందికి ఇస్తామని తెలిపారు. మొత్తం రూ.410 కోట్లను ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మంజూరుకు ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.


సోషల్‌ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం

రాష్ట్రంలో సోషల్‌ మీడియా దుర్వినియోగం బాగా పెరిగిందని, సీఎం, పీఎం, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని అనిత తెలిపారు. దీనికి సంబంధించి 1,384 కేసులు నమోదు చేసి, 1,067 మందిని అరెస్టు చేశామన్నారు. త్వరలోనే ప్రత్యేక చట్టం చేస్తామని తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 05:16 AM