Share News

జగన్‌రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టొచ్చు

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:01 AM

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రావణ్‌ జోస్‌ఫను సమర్థిస్తూ, అతనికి మద్దతిస్తానన్న మాజీ సీఎం జగన్‌రెడ్డిపైనా దేశద్రోహం కేసు పెట్టొచ్చని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్‌రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టొచ్చు

  • రాజకీయ లబ్ధి కోసం ఇంతగా దిగజారతారా?

  • ఇలాంటి వారిపై రాజద్రోహం కేసులు పెట్టాలి: మంత్రి ఆనం

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రావణ్‌ జోస్‌ఫను సమర్థిస్తూ, అతనికి మద్దతిస్తానన్న మాజీ సీఎం జగన్‌రెడ్డిపైనా దేశద్రోహం కేసు పెట్టొచ్చని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని, మత విద్వేషాలను రెచ్చగొట్టేవారికి మద్దతిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. హిందూమతం, సనాతన ధర్మం, రామాయణ, భారత, ఇతిహాసాలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, ఇలాంటి వారి చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగం ప్రకారం సెక్యులరిజం, మతసామరస్యం వైపు ప్రభుత్వాలు సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది వ్యక్తులు తమ వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వీటిని సమర్థించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటానికి సిద్ధపడినట్లుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటమే తప్పయితే, దానికి మద్దతు తెలుపుతున్న గొడ్డలి పార్టీ.. వారితో చేతులు కలపడం దేశ సౌభాగ్యాన్ని తుడిచివేసే ప్రయత్నం చేయడమే’ అని మండిపడ్డారు.


మత విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం

‘రావణ్‌ జోసఫ్‌ అనే వ్యక్తి.. ఏం సాధించాలని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయాలి. దీన్ని సమర్థించే వాళ్లని ఏ విధంగా ఆమోదించాలి?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారుల, హిందూ ధర్మాన్ని పరిరక్షించే వారిని విమర్శించే స్థాయికి దిగజారారంటే వారికి ఎవరిచ్చారీ హక్కు? అలాంటి వారికి మద్దతివ్వాలని ఆ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుకుందా?. రావణ్‌ జోసఫ్‌ అనే వ్యక్తి ద్వారా జగన్‌రెడ్డి చేస్తున్న కుతంత్రం, కుట్ర.. రాజ్యాంగ విలువల్ని తగ్గించేదిగా ఉంది. స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని, సనాతన ధర్మాన్ని, లౌకికవాదాన్ని, హిందూమతాన్ని, సంప్రదాయాలను, దేవతలను అవమానించే హక్కు వీళ్లకి ఎవరిచ్చారు? బ్రిటీష్‌ పాలకులు కూడా హిందూ దేవుళ్లని, హిందూమతాన్ని, మత పెద్దలను ఏనాడూ కించపర్చలేదు. జగన్‌రెడ్డికి కోట్లాది హిందువుల మనోభావాలు ముఖ్యమా? రావణ్‌ జోస్‌ఫ చేసే వ్యాఖ్యలు ముఖ్యమా? తేల్చి చెప్పాలి. ప్రభుత్వం జోస్‌ఫపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే.. నేను తోడుగా ఉంటానంటావా? చట్టపరంగా మద్దతిస్తానంటావా? జగన్‌ స్వేచ్ఛా భారతంలో ఉన్నాడా.. లేడా?. మత విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం. వ్యక్తిగత దూషణలు, మత విద్వేషం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సమర్థినీయం కావు. కానీ జగన్‌రెడ్డి వీటినే నమ్ముకున్నట్లుంది. దేశంలో స్నేహపూరిత వాతావరణాన్ని చెడగొట్టేలా జగన్‌ తీరు ఉంది. ఇలాంటి నాయకులపై ఉపా చట్టం 1967 ప్రకారం రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలి. ఆ కేసుల ప్రకారం వీళ్లందర్నీ శిక్షించి తీరాలి. అప్పుడే గొడ్డలి పార్టీ దుర్మార్గపు చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. ఇదే తరహా వ్యాఖ్యలు ఇతర మతాలపై చేస్తే జగన్‌ ఇదే వైఖరి ప్రదర్శిస్తారా? వైసీపీ పాలనలో సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే దేశద్రోహం కేసు పెట్టలేదా? జైళ్లలోకి నెట్టలేదా? ఈవేళ ఇంత పెద్ద మత విద్వేషానికి పాల్పడిన రావణ్‌ జోస్‌ఫని, అతన్ని సమర్థించే నిన్ను(జగన్‌ను) దేశద్రోహులు అనడం తప్పా? మీ మీదా దేశ ద్రోహం కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా.. లేదా? అనేది చర్చనీయాంశంగా ఉందని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు.


బహిరంగ చర్చకు సిద్ధం

హిందూ ధార్మిక సంస్థలపై అనుమానాలు, భక్తుల్లో అపోహలు సృష్టించడం, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం, రాజకీయ లబ్ధి కోసం వాస్తవాలను వక్రీకరించి, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా జగన్‌ పత్రిక.. దేవదాయ శాఖపై నిరాధార కథనాలను ప్రచురించడాన్ని మంత్రి ఆనం ఖండించారు. ఆలయాల హుండీలను తానేదో భుజానేసుకుని ఎత్తుకెళ్లినట్లు రాశారని మండిపడ్డారు. వాళ్లకి ధైర్యం ఉంటే బెజవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలను మాయం చేసింది తామేనని ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ నాయకుడికి దమ్ముంటే దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో కూర్చోని.. గత ఐదేళ్లలో వాళ్లేం చేశారో.. ఈ రెండేళ్లలో మేమేం చేశామో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం, వెండి వస్తువుల చోరీలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసినవారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 09 , 2026 | 04:02 AM