అక్రమంగా 22ఏ1సీలోకి..!
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:28 AM
జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో సామాన్య రైతులను భయభ్రాంతులకు గురిచేసి.. వారి వంశపారంపర్య సొంత పట్టా భూములను కూడా అక్రమంగా 22 ఏ1సీ కింద దేవదాయ రికార్డుల్లో చేర్చిందని..
వంశపారంపర్య భూములనూ దేవదాయ రికార్డుల్లో చేర్చారు
రాజకీయ కక్షతో జగన్ ప్రభుత్వ నిర్వాకం
రాష్ట్రంలో ఆలయ భూములు 4.48 లక్షల ఎకరాలే
కానీ 6 లక్షలకు పెంచేశారు: మంత్రి ఆనం
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో సామాన్య రైతులను భయభ్రాంతులకు గురిచేసి.. వారి వంశపారంపర్య సొంత పట్టా భూములను కూడా అక్రమంగా 22 ఏ1సీ కింద దేవదాయ రికార్డుల్లో చేర్చిందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రెండేళ్ల సుపరిపాలన ప్రగతి, కోట్ల విలువైన ఆలయాల భూముల సంరక్షణ, ఉద్యోగాల భర్తీ, గోదావరి పుష్కరాల రోడ్ మ్యాప్‌తో కూడిన సమగ్ర నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో 21,672 ఆలయాలను నోటిఫై చేశామని, వీటికి సంబంధించి 4.48 లక్షల ఎకరాల భూములు మాత్రమే ఆస్తులుగా ఉన్నాయని.. కానీ ప్రస్తుతం ఆరు లక్షల పైగా ఎకరాలు దేవదాయ శాఖకు చెందినట్లు రికార్డుల్లో నమోదయ్యాయని వివరించారు. గత ప్రభుత్వం అక్రమంగా 22ఏ1సీ కింద తమ భూములను చేర్చడంతో రైతులు తమ పట్టాలు పట్టుకుని తిరుగుతున్నారని చెప్పారు. తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో దేవాలయాల సంక్షేమానికి ఏ పార్టీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించిన దాఖలాలు లేవని.. కానీ కూటమి తన మేనిఫెస్టోలో దేవదాయశాఖకు ప్రత్యేక స్థానం కల్పించి 11 ధార్మిక హామీలు ఇచ్చిందని.. వాటిలో 10 హామీలను జీవోలతో సహా వంద శాతం అమలు చేసి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నామని ఆనం ప్రకటించారు. రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాల నిధులు రూ.10 వేలకు పెంచామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6137 ఆలయాల అర్చకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. పండితుల గౌరవ వేతనాన్ని రూ.10 నుంచి రూ.15 వేలకు పెంచామని, దీని వల్ల 188 మంది వేద పండితులకు తక్షణ లబ్ధి చేకూరుతోందని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో 162 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.71.60 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించామని.. 2027 మార్చి నాటికే ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులకు డెడ్‌లైన్ విధించామని తెలిపారు. జూలై మొదటి వారం నుంచి తాను స్వయంగా ఆరు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తానన్నారు. తిరుమలలో ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలను మంత్రి వివరించారు.