Share News

మహా పాపం చేశారు

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:42 AM

వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరస్వామికి ఘోర అపచారం జరిగిందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు.

మహా పాపం చేశారు

  • నిబంధనల సడలింపుతోనే ‘కల్తీ’

  • 2005లోనే మొదలైన అపచారం

  • రెండు కొండలంటూ నాడు జీవో

  • డిక్లరేషన్‌పై ఏనాడూ సంతకం చేయని జగన్‌

  • మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైర్‌

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరస్వామికి ఘోర అపచారం జరిగిందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి అంశంపై శాసనమండలిలో జరిగిన లఘుచర్చకు వివరణగా మంత్రి మాట్లాడారు. ‘‘టీటీడీ నెయ్యి సేకరణకు పాటించాల్సిన నాలుగు నిబంధనలను 2020లో వైసీపీ ప్రభుత్వ పెద్దలు మార్చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఆదేశాలతో కల్తీ పాపానికి తెరతీశారు. 2020-2024 వరకు కల్తీ నెయ్యిని యఽథేచ్ఛగా వినియోగించారు. 2022-24 మధ్య ఒక్క ట్యాంకర్‌ నెయ్యిని కూడా పరీక్షించకుండా అనుమతించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సిట్‌ దర్యాప్తు చేపట్టగా, వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్‌ కల్తీ నెయ్యిని ఆనాడు లడ్డూల్లో వాడినట్టు తేల్చింది. చార్జిషీటులోనూ ఇదే విషయం స్పష్టం చేసింది. అయినా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. వీళ్లకు దేవుడిపై నమ్మకం లేదు. 2005 లోనే హిందూ మత విధ్వంసం ప్రారంభమైంది. తిరుమల వెంకన్నకు ఏడు కొండలు కాదు.. రెండు కొండలేనని అప్పటి క్రిస్టియన్‌ అధికారితో జీవో ఇప్పించారు. డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉండగా, జగన్‌ ఏనాడూ చేయలేదు. హిందూ సమాజానికి జగన్‌ సహా వైసీపీ సభ్యులంతా క్షమాపణ చెప్పాలి’’ అని మంత్రి అన్నారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఏడుకొండలుకు, లడ్డూ ప్రసాదానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతున్నంతసేపూ పోడియం వద్దే నిలబడి నినాదాలు చేశారు. అయిపోయిందా.. ఇంతేనా.. అంటూ మంత్రి లోకేశ్‌... వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. అనంతరం మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు.

Updated Date - Mar 07 , 2026 | 04:42 AM