Share News

హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలి

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:53 AM

శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు హిందూ జాతి తలదించుకునేలా ఉందని దేవదాయ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు.

హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలి

  • వైసీపీపై దేవదాయ శాఖ మంత్రి ఆనం ఫైర్‌

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు హిందూ జాతి తలదించుకునేలా ఉందని దేవదాయ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీలు వేంకటేశ్వరస్వామిని అవమానించారని, దేవుడిని రాజకీయాల్లోకి లాగి అపవిత్రం చేస్తున్నారన్నారు. ఇది జగన్‌ ఆదేశాలతోనే జరిగిందన్నారు. హిందూ జాతికి వైసీపీ క్షమాపణలు చెప్పాలన్నారు.

ఇది బ్లాక్‌ డే: టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ

జగన్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ విమర్శించారు. స్వామి ఫొటోను సభలోకి చెప్పులు వేసుకుని ప్లకార్డుల్లా తీసుకురావడం దేశ సంస్కృతికే బ్లాక్‌ డే అన్నారు.

చర్యలు తీసుకోవాలి: జనసేన ఎమ్మెల్యే నాయకర్‌

వైసీపీ సభ్యుల తీరును ప్రతి హిందువు తప్పుపడుతున్నారని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ తెలిపారు. వారిపై చైర్మన్‌ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

వారిని సస్పెండ్‌ చేయరా: చీఫ్‌ విప్‌ అనూరాధ

చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాన్ని ప్రదర్శించడానికి వైసీపీ మహిళా ఎమ్మెల్సీలకు సిగ్గులేదా అని మండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆందోళన చేస్తున్న సభ్యులను సస్పెండ్‌ చేయకుండా చైర్మన్‌ వాయిదాలు వేస్తున్నారని, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలేదన్నారు.

వారి తీరు సరికాదు: ఎమ్మెల్సీ గాదె

వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి, ప్లకార్డుల్లా వాడడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 04:53 AM