పేర్నికి లీగల్ నోటీసులిస్తా: మంత్రి అనగాని
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:26 AM
నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి లీగల్ నోటీసులు పంపిస్తా.
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి లీగల్ నోటీసులు పంపిస్తా. చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ‘వైసీపీ నేతలకు రాజకీయంగా తలపడడం చేతగాక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వారి నేత జగన్ నిత్యం చేసేది అదే. ఇప్పుడు పేర్ని నాని ఆయన బాటలో పయనిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో రీ-సర్వే హడావుడిగా చేయడం వల్ల చాలా తప్పులు దొర్లాయి. వాటిని కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పాం. పేర్ని నాని ప్రెస్ మీట్‌లోనే వైసీపీ ప్రభుత్వం ముద్రించిన పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్ తెరుచుకోని పరిస్థితి కనిపించింది. అసలు విషయాన్ని పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగారు. నా రేటు పేర్ని నాని చెప్పేదేంటీ? డబ్బు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, డబ్బు సంపాదించడం వారికి అలవాటు’ అని అనగాని మండిపడ్డారు.