వైసీపీ పాపాలు కడుగుతున్నాం
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:54 AM
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ, ప్రజల భూములను కబళించారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
22ఏ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: మంత్రి అనగాని
వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీ ఆమోదం
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ, ప్రజల భూములను కబళించారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అప్పట్లో వారు చేసిన పాపాలను తాము కడుగుతున్నామని అన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విపత్తు నిర్వహణకు రూ.9,164 కోట్ల బడ్జెట్ కేటాయింపును ఆమోదించాలని శుక్రవారం శాసనసభలో ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను అడ్డం పెట్టుకొని 1.75 లక్షల ఎకరాలు కాజేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో పూర్తిస్థాయి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో పాత పొరపాట్లను సరిచేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, దీనివల్ల విశ్వసనీయ, కచ్చితమైన భూ రికార్డులు సిద్ధమవుతాయన్నారు. రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో 15 రకాల రక్షణ అంశాలతో కూడిన పాస్‌బుక్‌లు అందిస్తున్నామని చెప్పారు. 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.