రైతు ఆదాయం పెంపే లక్ష్యం
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:35 AM
‘రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతు ఆదాయం పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదు
డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు
రైతు సంక్షేమానికి ప్రభుత్వం
కట్టుబడి ఉంది: మంత్రి అచ్చెన్నాయుడు
గుంటూరు సిటీ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ‘రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతు ఆదాయం పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరు లాంఫాంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం ఎద్దులతో అరక దున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని సీఎం చంద్రబాబు నాయకత్వంలో గాడిలో పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. రైతులు మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేయాలని, ఒకే పంటను అధికంగా సాగు చేస్తే ధరలు పడిపోయి నష్టాలు తప్పవని హెచ్చరించారు. అధిక రసాయనాల వినియోగం కారణంగా గుంటూరు మిర్చి ఎగుమతులపై ప్రభావం పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు నష్టం కలగకుండా టుబాకో బోర్డు, వ్యాపారులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
2026-27 సంవత్సరానికి రాష్ట్రంలో ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని 81 మిలియన్ కిలోలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. హెచ్‌డీ బర్లీ పొగాకు రైతులకు గతంలో రూ.273 కోట్ల సాయం అందించామని, తోతాపురి మామిడి రైతులకు ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నామని తెలిపారు. వీసీ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతులు తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటలపై దృష్టి సారించాలన్నారు. శాస్త్రవేత్తల సలహాలను రైతులు పరిగణలోకి తీసుకొని సాగుకు ఉపక్రమించాలన్నారు. ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ ఎస్.సాయికాంత్ వర్మ, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, సహకార శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
వైసీపీకి అమరావతిలో పర్యటించే హక్కు లేదు
అమరావతి రైతులను గతంలో అవమానించిన వైసీపీ నాయకులకు ఇప్పుడు అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని మంత్రి అచ్చెన్న అన్నారు. రాజధాని రైతుల త్యాగాలను గుర్తించని వారు ఇప్పుడు వారి ప్రేమ కోసం వస్తున్నట్లు మాట్లాడటం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు.
రైతే రాష్ట్రానికి వెన్నెముక: సంధ్యారాణి
పార్వతీపురం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ర్టానికి రైతే వెన్నెముక అని, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నదాతలకు చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తిన సవాళ్లను రైతన్నలు అధిగమించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా అన్నదాతలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.