Share News

మే15 నుంచే ఖరీఫ్‌ సాగు చేపట్టాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:09 AM

ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు మే 15 నుంచే మొదలు పెట్టాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

మే15 నుంచే ఖరీఫ్‌ సాగు చేపట్టాలి

  • ’రైతన్నా మీకోసం’ను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న

అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు మే 15 నుంచే మొదలు పెట్టాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులుతో కలిసి, ’రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చె న్న మాట్లాడుతూ.. ‘రిజర్వాయర్లలో నీరు ఉన్న నేపథ్యంలో 2 నెలల ముందే సాగు మొదలు పెట్టాలి. దీనివల్ల అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోవ చ్చు. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంది. అందువల్ల నీటిని పొదుపుగా వినియోగించాలి. డ్రిప్‌, స్ర్పింక్లర్‌ పద్ధతులపై అవగాహన కల్పించడానికి ఈనెల 22 వరకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చేపట్టాం’ అని చెప్పారు. రైతును రాజులా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతన్న క్షేమం, సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, కృత్రిమ మేధ(ఏఐ), డ్రోన్‌ సాంకేతికత వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తున్నామని చెప్పారు. రైతుల ఇళ్లకు వెళ్లి, వారి తో మాట్లాడి వ్యవసాయం, పండిస్తున్న పంటలు, సాగు పద్ధతులు, గిట్టుబాటు ధర తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌’ కరపత్రాలు అందజేశారు.


నీటి భద్రత, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ అంశాలపై అవగాహన కల్పించారు. గతంలో రైతులు వారి అవసరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది ప్రతి రైతు కుటుంబాన్ని సందర్శించి పంచ సూత్రాలను వివరించి, వారి అవసరాలను గుర్తించి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ వారికి పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌ పథకాన్ని అమలుచేస్తోందన్నారు. రైతులు వైవిధ్య పంటలు వేసి, సుస్థిర వ్యవసాయానికి బాటలు వేసి అధిక దిగుబడి, నికరాదాయం పొందాలని సూచించారు.

Updated Date - Mar 17 , 2026 | 06:10 AM