రైతులను అప్పుల్లోకి నెట్టిందే వైసీపీ: అచ్చెన్న
ABN , Publish Date - May 18 , 2026 | 06:15 AM
ఐదేళ్లూ అధికారంలో ఉండి రైతాంగాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ పాలకులు ఇప్పుడు రైతులపై సానుభూతితో మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లూ అధికారంలో ఉండి రైతాంగాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ పాలకులు ఇప్పుడు రైతులపై సానుభూతితో మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. రైతులకు సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందక ఇబ్బంది పడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోయారు. రైతు భరోసా పేరుతో చెప్పినంత ఇవ్వకుండా మోసం చేశారు’ అని ఆదివారం ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. మామిడి రైతుల సమస్యలపై మాట్లాడే ముందు వైసీపీ హయాంలో ఉద్యాన రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకోవాలన్నారు. వైసీపీ పాలనలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దారుణంగా లేదా? కనీస మద్దతు ధర అమలులో విఫలం కాలేదా? రైతులు రోడ్లపై ఆందోళన చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? కేవలం ప్రచార రాజకీయాలు తప్ప.. రైతు సంక్షేమం పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు సంబంధించిన ప్రతి అంశంపైనా సమీక్ష చేస్తున్నాం. నిజంగా రైతుల కోసం పని చేయాలనే ఉద్దేశం వైసీపీ నేతలకు ఉంటే చౌకబారు విమర్శలు మానాలని హితవు పలికారు.