Share News

నౌకాదళానికి నూతన శక్తి

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:00 AM

భారత నౌకాదళంలోకి ప్రతి 50 రోజులకు ఒక నూతన శక్తి వచ్చి చేరుతోందని తూర్పు నౌకాదళానికి చెందిన రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద అన్నారు.

నౌకాదళానికి నూతన శక్తి

  • మిలాన్‌-2026 కొత్త స్ఫూర్తిని ఇచ్చింది

  • ఈఎన్‌సీ రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద

విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళంలోకి ప్రతి 50 రోజులకు ఒక నూతన శక్తి వచ్చి చేరుతోందని తూర్పు నౌకాదళానికి చెందిన రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద అన్నారు. మిలాన్‌-2026 ముగింపు సందర్భంగా బుధవారం ఆయన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై విలేకరులతో మాట్లాడారు. దేశీయ పరిజ్ఞానంతోనే అన్ని నౌకలు, బోట్లు, విమానాలు తయారవుతున్నాయని తెలిపారు. చిన్నదో.. పెద్దదో ఏదో ఒకటి ప్రతి 50 రోజులకు ఒకటి నేవీలో చేరుతున్నదని చెప్పారు. మిలాన్‌ను మొదట ప్రారంభించినప్పుడు 5 దేశాలే పాల్గొన్నాయని, ఇప్పుడు ఆ సంఖ్య 75కు పెరిగిందని అన్నారు. ఈసారి నిర్వహించిన మిలాన్‌లో 40 యుద్ధనౌకలు, 29 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని, వాటిలో విదేశీ నౌకలు 18, విమానాలు 5 ఉన్నాయని తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో హార్బర్‌లో సమావేశాలు, పరస్పర అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 21 నుంచి 25వ తేదీ వరకు సముద్రంలో పలు విన్యాసాలు చేపట్టామని వెల్లడించారు. యుద్ధ విమానాలు సుమారు 90 గంటలు గగనతలంలో విహారం చేశాయని చెప్పారు. ఈసారి మిలాన్‌లో తొలిసారిగా విమాన వాహక నౌక విక్రాంత్‌ నుంచి మిగ్‌-29కే విమానాలు విన్యాసాలు చేశాయన్నారు. ఐఎన్‌ఎస్‌ శక్తికి అవసరమైన ఇంధనాన్ని సముద్రంలోనే విదేశీ నౌకలతో అందించడం మరో విశేషమన్నారు. ‘సాహసం.. సమన్వయం.. సహకారం’ అనే నినాదంతో చేపట్టిన మిలాన్‌-2026 విజయవంతమైందని, కొత్త స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 04:01 AM