వలస కూలీల వరుస
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:58 AM
రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో పొరుగు రాష్ర్టాల నుంచి వలస కూలీల రాక మొదలైంది.
వ్యవసాయ పనుల ప్రారంభంతో ఎన్టీఆర్ జిల్లాకు ఒడిశా కార్మికులు
రాష్ట్రంలో రైతు కూలీలకు కొరత
విజయవాడ/ఉయ్యూరు, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో పొరుగు రాష్ర్టాల నుంచి వలస కూలీల రాక మొదలైంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో స్థానికంగా కూలీల కొరత తీవ్రంగా ఉండటం, కూలి రేట్లు అమాంతం పెరిగిపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని జగదల్‌పూర్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ కుటుంబాలతో సహా విజయవాడకు చేరుకున్నారు. ఈ కూలీలను ఉయ్యూరు పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు తమ గ్రామాలకు తీసుకెళ్లారు. ఉయ్యూరుకు చెందిన ఒక రైతు తన పొలంలో మినుము పంట కోత కోసం కొందరు కూలీలను తీసుకువెళ్లారు. స్థానికంగా రైతు కూలీలు దొరకడం గగనంగా మారిందని, ఉన్నవారు కూడా అధిక వేతనం డిమాండ్ చేస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో ఒడిశా కూలీలపై ఆధారపడక తప్పడం లేదని చెబుతున్నారు. ఒడిశా నుంచి వచ్చిన కూలీలకు రైతులతో కుదిరిన ఒప్పందం ప్రకారం సొమ్ములు చెల్లిస్తున్నారు. దంపతులకు రోజుకు రూ.1300 చొప్పున చెల్లించనున్నట్టు రైతులు తెలిపారు. దీంతోపాటు వీరికి వసతి, సౌకర్యాలను రైతులే స్వయంగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20 రోజుల పాటు పొలాల్లో పని చేస్తారని, అనంతరం.. ఇతర ప్రాంతాల్లో పనులుంటే అక్కడికి వెళ్తారని ఓ రైతు తెలిపారు. ఇక, తమ సొంత రాష్ట్రంలో కంటే మెరుగైన ఉపాధి, వేతనం కూడా లభించడంతో ఇతర రాష్ట్రాలకు వస్తున్నట్టు ఒడిశా కూలీలు చెబుతున్నారు.