Share News

అర్ధరాత్రి ‘అంగడియ’!

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:22 AM

విజయవాడలో అర్ధరాత్రి అంగడియ (చీకటి వ్యాపారం చేసే వారు పెట్టుకున్న కోడ్‌) జోరుగా సాగుతోంది. ఎలాంటి బిల్లులు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బంగారం, వివిధ రకాల వస్తువులు వస్తున్నాయి. వాటిని తీసుకొచ్చే గ్యాంగ్‌లు, పార్శిల్‌ సంస్థలతో వాణిజ్య పన్నుల శాఖలోని కొంతమంది అధికారులు చీకటి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం డ్రైవర్లు, అటెండర్లను ఉపయోగించుకుంటున్నారు. అధికారులు ఈ దందాలకు వంత పాడడంతో వాణిజ్య పన్నులశాఖలో ఉన్న డ్రైవర్లు, అటెండర్లు శ్రుతి మించుతున్నారు.

అర్ధరాత్రి ‘అంగడియ’!

నగరానికి ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి బిల్లులు లేని బంగారం

ఆయా గ్యాంగ్‌లకు ‘కమర్షియల్‌’ బంధాలు

సరుకు వచ్చినప్పుడల్లా భారీగా ముడుపులు!

వన్‌టౌన్‌, గవర్నరుపేటలో దందాలు!

ఒక్కో గ్యాంగ్‌ నుంచి రూ.50వేలు నుంచి రూ. లక్ష వసూలు

- ముంబై నుంచి ముగ్గురు వ్యక్తులు బంగారం బిస్కెట్లను తీసుకుని విజయవాడకు వచ్చారు. వాటికి ఎటువంటి బిల్లులు లేవు. రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు రాగానే ఒక కారు వెళ్లి వారి ముందు ఆగింది. డ్రైవర్‌ను తీసుకుని వారు ఒక పక్కకు వెళ్లారు. బ్యాగ్‌లో నుంచి రెండు రూ.50వేల కట్టలను డ్రైవర్‌ చేతిలో పెట్టారు. ఆ నగదును కారులో పెట్టుకుని డ్రైవర్‌ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఆ బిస్కెట్లను వ్యాపారులకు అప్పగించారు. కొద్దినెలల క్రితం జరిగిన ఘటన ఇది.

చెన్నైలో తయారు చేసిన ఆభరణాలతో ఇద్దరు వ్యక్తులు విజయవాడ చేరుకున్నారు. వారు పీఎన్‌బీఎస్‌ నుంచి బయటకు వచ్చి ఒక చీకటి ప్రదేశంలో వేచి ఉన్నారు. కాసేపటికి కారులో ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లారు. రూ.50 వేలు ఉన్న కవర్‌ను కారులో పెట్టారు. ఆ తర్వాత కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. చెన్నై నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాత్రం వన్‌టౌన్‌లోని బంగారం షాపులకు వెళ్లారు.

ఇలా విజయవాడలో అర్ధరాత్రి అంగడియ (చీకటి వ్యాపారం చేసే వారు పెట్టుకున్న కోడ్‌) జోరుగా సాగుతోంది. ఎలాంటి బిల్లులు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బంగారం, వివిధ రకాల వస్తువులు వస్తున్నాయి. వాటిని తీసుకొచ్చే గ్యాంగ్‌లు, పార్శిల్‌ సంస్థలతో వాణిజ్య పన్నుల శాఖలోని కొంతమంది అధికారులు చీకటి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం డ్రైవర్లు, అటెండర్లను ఉపయోగించుకుంటున్నారు. అధికారులు ఈ దందాలకు వంత పాడడంతో వాణిజ్య పన్నులశాఖలో ఉన్న డ్రైవర్లు, అటెండర్లు శ్రుతి మించుతున్నారు.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

నగరం మొత్తం నిద్రపోతుంటే ఈ రెండు వర్గాలు( పార్శిల్‌ కార్యాలయాల నిర్వాహకులు, బంగారం వ్యాపారులు) మాత్రం మేల్కొని ఉంటున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు వాణిజ్య పన్నులశాఖలో పనిచేసే వాంబేకాలనీకి చెందిన డ్రైవర్‌ ప్రసాద్‌, కొద్దినెలల క్రితం ఏసీబీకి చిక్కిన అటెండర్‌ కొండపల్లి శ్రీనివాసరావు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పరిస్థితి దొరికితే దొంగలు.. లేకపోతే దొరలు అన్నట్టుగా ఉంది. ఇక్కడి వ్యవహారాలు ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి జరిగే అంగడియను కొంతమంది అధికారులు, డ్రైవర్లు, అటెండర్లు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. గడచిన కొన్నేళ్లుగా ఈ అంగడియ సంస్కృతి కొనసాగుతోందని తెలుస్తోంది. పార్శిల్‌ కార్యాలయాల నిర్వాహకులు, బంగారం వ్యాపారులు ఈ చీకటి దందాల్లో పాత్రధారులుగా ఉంటున్నారు.

ఏమిటి ఈ అంగడియ?

సాధారణంగా అంగడి అంటే చిన్న దుకాణం లేక వ్యాపార స్థలం. చీకటి వ్యాపారం చేసే వారు ఒక కోడ్‌గా ఉంటుందని అంగడియ పదాన్ని సృష్టించుకున్నారు. విజయవాడ వన్‌టౌన్‌, గవర్నరుపేటలో బంగారం తయారీ కేంద్రాలు, బంగారు ఆభరణాల దుకాణాలు భారీగా ఉన్నాయి. ఈ రెండు చోట్ల రోజుకు కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ముంబై, చెన్నై, నెల్లూరు, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి ఇక్కడి తయారీ కేంద్రాలకు బంగారం బిస్కెట్లు, వెండి బ్రిక్స్‌ను తీసుకొస్తుంటారు. అదేవిధంగా తయారు చేసిన ఆభరణాలు వస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఇలా వచ్చే ప్రతి వస్తువుకు పన్ను చెల్లించాలి. ఎలాంటి బిల్లులు లేకుండా ఈ ప్రాంతాల నుంచి కొంతమంది బంగారం బిస్కెట్లు, వెండి బ్రిక్స్‌, తయారు చేసిన ఆభరణాలను తీసుకొస్తున్నారు.

అర్ధరాత్రే అడుగు పెడతారు!

చేసేదంతా చీకటి వ్యాపారం కావడంతో వాళ్లంతా అర్ధరాత్రి సమయంలో విజయవాడలో అడుగుపెట్టే విధంగా ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. రైళ్లు, బస్సులు, లారీల్లో ఇక్కడికి వస్తున్నారు. ఇలా వస్తున్న గ్యాంగ్‌లతో వాణిజ్య పన్నుల శాఖలోని కొంతమంది అధికారులు సత్సంబంధాలు పెట్టుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రయాణానికి ముందు రోజుడ్రైవర్లు, అటెండర్లకు ఆయా ప్రాంతాల నుంచి సమాచారం వస్తోంది. సరుకుతో గ్యాంగ్‌లు విజయవాడకు చేరుకోగానే రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ పరిసరాలను మీటింగ్‌ ప్రదేశాలుగా నిర్ణయించుకుంటున్నారు. తమను పట్టుకుని కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు ఒక్కో గ్యాంగ్‌ ట్రిప్‌నకు రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు వారి చేతుల్లో పెడుతోంది. ఈ విషయంలో వారికి పార్శిల్‌ కార్యాలయాల నిర్వాహకులు, బంగారం వ్యాపారులు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లు నెలకు ఒకసారి గానీ, రెండు నెలలకు ఒకసారి గానీ సరుకుతో విజయవాడకు వస్తుంటాయి. ఈ గ్యాంగ్‌లతో అధికారులు సంబంధాలు పెంచుకుని ఆదాయ మార్గాలను పటిష్టం చేసుకుంటున్నారు. ఆ మార్గాలు దెబ్బతినకుండా డ్రైవర్లు, అటెండర్లు కాపాడుతున్నారు. విజయవాడలో అర్ధరాత్రి జరుగుతున్న అంగడియ వ్యవహారం కోడై కూస్తోంది.

Updated Date - Feb 11 , 2026 | 01:22 AM