ముప్పిడి అవినాశ్ రెడ్డికి బెయిల్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:28 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి(ఏ7)కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి అతనికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది.
మంజూరు చేసిన సుప్రీంకోర్టు
దర్యాప్తునకు సహకరిస్తున్నారు.. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి: సిద్ధార్థ్ దవే
ఏడాది పాటు తప్పించుకు తిరిగారు.. బెయిల్ ఇవ్వొద్దు: ప్రభుత్వం వాదనలు
న్యూఢిల్లీ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి(ఏ7)కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి అతనికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాశ్ రెడ్డి ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ముందు దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని, ఆ తర్వాతే బెయిల్ విషయం ఆలోచిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు అవినాశ్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయంలో లొంగిపోయారు. శుక్రవారం ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 26న అవినాశ్ రెడ్డి లొంగిపోయారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మూడురోజుల పోలీసు కస్టడీ ముగిసిందని, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఇదే కేసులో ఆయన సోదరుడితో పాటు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరైందని, దర్యాప్తునకు సహకరిస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రావాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం చిన్నపాటిది కాదని, రూ.730 కోట్ల భారీ స్కామ్ అని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా అవినాశ్ రెడ్డి ఏడాది పాటు విదేశాల్లో తప్పించుకుని తిరిగారని గుర్తుచేశారు.
మూడు రోజుల కస్టడీలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని, మరో 10 రోజుల సమయం ఇస్తే దర్యాప్తు కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆ ప్రభావం కేసు దర్యాప్తుపై పడుతుందని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం.. అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ట్రయల్ కోర్టు షరతులకు లోబడి బెయిల్ మంజూరవుతుందని తెలిపింది. ఈ కేసుకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ తీర్పును ఇతర ఏ కేసుల్లోనూ బెయిల్ మంజూరు కోసం ఒక ప్రామాణికంగా పరిగణించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.