Sanjeevaraya Temple: మగవాళ్లకు మాత్రమే
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:29 AM
రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. రాతి శిల రూపంలో ఉన్న ఆయనకు ఏటా సంక్రాంతికి ముందు...
సంజీవరాయునికి పురుషులతో పొంగళ్లు
పొయ్యి మంట, వంట అంతా వారిదే..
గుడి ప్రవేశం, ప్రసాదం మహిళలకు నిషిద్ధం
రేపు తిప్పాయపల్లెలో పొంగుబాళ్ల పండగ
ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు ప్రత్యేక ఆచారం
పండగైనా, జాతరైనా.. చాలా వరకు ఆడవాళ్లదే హవా! పూజల నుంచి వంటల వరకు అంతా వారిదే!! అయితే ఆ గ్రామంలో సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం జరిగే వేడుకల ప్రత్యేకతే వేరు.. అక్కడ జరిగే పొంగుబాళ్ల పండగ మగవాళ్లకు మాత్రమే పరిమితం! గ్రామంలోని సంజీవరాయస్వామికి మగవాళ్లే పొంగళ్లు వండి, నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో రేపు(ఆదివారం) జరగనున్న ఈ ఆసక్తిరమైన పండుగ విశేషాలివీ..
(రైల్వేకోడూరు-ఆంధ్రజ్యోతి)
రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. రాతి శిల రూపంలో ఉన్న ఆయనకు ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం మగవాళ్లే పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. తిప్పాయపల్లెతో పాటు చుట్టుపక్కల గ్రామాల మగవాళ్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. మగదేవుడైన సంజీవరాయునికి పూజాక్రతువులన్నీ పూర్తిగా మగవాళ్లే చేయాలి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పురుషులు తెల్లవారుజామునే పొంగలికి అవసరమయ్యే సామగ్రిని బుట్టలో పెట్టుకొని, చేతిలో కట్టెలు తీసుకుని ఇళ్లనుంచి సంజీవరాయస్వామి ఆలయానికి చేరుకుంటారు. వీరి వెంట ఆడవాళ్లు ఎవరూ రారు. మగవాళ్లే పొయ్యి వెలిగించి, పొంగలి వండుతారు. అనంతరం స్వామికి నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. ఆ పొంగలిని కూడా మగవాళ్లు మాత్రమే తినాలి. మహిళలు ముట్టుకోరు.
గేటు బయటే మహిళలు
సంజీవరాయుని సన్నిధికి వచ్చి, స్వామిని దర్శించుకోవడానికీ ఆడవాళ్లకు ప్రవేశం లేదు. వారు గేటు బయట నిలబడాల్సి ఉంటుంది. పూజ చేసిన తర్వాత పూజారే గేటు వెలుపలకు వచ్చి మహిళలకు హారతి ఇస్తారు. అయితే బాలికలు, వృద్ధురాళ్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఆలయానికి వచ్చి సంజీవరాయుడిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు.
ఇదీ సంజీవరాయుని కథ
సంజీవరాయుడికి విగ్రహ రూపం ఉండదు. కేవలం నిలబడి ఉన్న రాతి బండపై చెక్కిన బీజాక్షరాలనే సంజీవరాయుడిగా భావించి ప్రజలు కొలుస్తారు. ఇందుకు ఈ ప్రాంతంలో ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. తిప్పాయపల్లె గ్రామస్తుల కథనం ప్రకారం... కరువు కాటకాలు, అంటు వ్యాధులతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్న కాలంలో.. ఒక వృద్ధుడు గ్రామంలో సంచరిస్తూ ఒక సలహా ఇచ్చాడు. ఒక రాయిని చూపించి, దానిపై బీజాక్షరాలు రాసి, ఇక నుంచి ఇది రాయికాదు సంజీవరాయుడు అని చెప్పాడు. ఈ దేవుడికి పూజలు చేయాలి. అయితే మగవాళ్లు మాత్రమే పూజిస్తే అంతా బాగుంటుందని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఆ ఊరి మగవాళ్లు పూజలు చేశారు. వానలు కురిసి, పంటలు పండాయి. వ్యాధులు తగ్గాయి. అప్పటి నుంచి అదే ఆచారంగా మారింది.