అతడు.. ఆమెగా మారాల్సిందే!
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:51 AM
హోలీ పండుగ వచ్చిందంటే దేశ వ్యాప్తంగా రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో మాత్రం మగవారు..
హోలీ రోజు మహిళల వేషధారణలో పురుషులు
కర్నూలు జిల్లా సంతెకుడ్లూరులో వింత ఆచారం
ఆదోని రూరల్, మార్చి 4: హోలీ పండుగ వచ్చిందంటే దేశ వ్యాప్తంగా రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో మాత్రం మగవారు.. మహారాణుల్లా ముస్తాబవుతారు. కోరిన కోరికలు తీరేందుకు గ్రామంలో వెలసిన రతీమన్మథులను స్ర్తీ వేషధారణతో దర్శించుకుంటారు. రెండ్రోజులపాటు గ్రామంలో రతీమన్మథుల రథోత్సవం, కామదహనం ఆధ్యాత్మికతను చాటి చెబుతాయి. మగువల వేషధారణతో పురుషులు గ్రామంలో తిరుగుతూ సందడి చేస్తారు.
మగ మహారాణులు
పేద రైతు అయినా, పెద్ద భూస్వామి అయినా, ప్రభుత్వ ఉద్యోగి, ప్రజాప్రతినిధి, రోజువారి కూలీ ఇలా ఎవరైనా సరే కోరికలు తీరాలంటే కచ్చితంగా కొంగు కట్టాల్సిందే. కోరిక తీర్చే క్రమంలో అచ్చం మగువలా అంచు పట్టుచీర కట్టుకొని నెత్తిన పూలు పెట్టుకొని.. నుదుట బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు, కాళ్లకు పారాణి రాసుకొని, బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డాణం ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొంటారు. గ్రామంలోని బసవేశ్వర స్వామి ఆలయంలో వెలసిన రతీమన్మథులను హోలీ పండుగ సందర్భంగా వివిధ పూలు, ఆభరణాలతో అలంకరించారు.

ఉద్యోగం కోసం మొక్కు
నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే చీరకట్టులో 5 సంవత్సరాల పాటు రతీమన్మఽథులను దర్శించుకుంటాడని మా అమ్మ మొక్కుకొంది. నాకు ఆస్పరి మండలంలో స్టేట్ బ్యాంకులో ప్రభుత్వ కొలువు వచ్చింది. అందుకే ఏటా హోలీ పండుగ రోజు చీర ధరించి మా ఊరిలో వెలసిన రతీమన్మథులను దర్శించుకొని ముడుపు చెల్లించుకుంటున్నాను.
- ఉదయ్, బ్యాంకు ఉద్యోగి, సంతెకుడ్లూరు

వ్యాపారంలో వృద్ధి చెందాలని
వ్యాపారంలో వృద్ధి చెందాలని కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని రతీమన్మథులను మొక్కుకున్నా. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించాను. నా కోరికలు నెరవేరడంతో పది సంవత్సరాల నుంచి ఇలా చీరకట్టులో స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నాను.
- కె.గురులింగప్ప, ఫెర్టిలైజర్ యజమాని