Share News

మేం అడ్డదారిలో ఉద్యోగాలు పొందలేదు

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:04 AM

తాము అడ్డదారిలో ఉద్యోగాలు పొందలేదని, ఏళ్ల పాటు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించామని మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లు స్పష్టం చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా....

మేం అడ్డదారిలో ఉద్యోగాలు పొందలేదు

  • వైసీపీ నేతలు మా మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం

  • ఏళ్ల పాటు శ్రమించి ఉద్యోగాలు సాధించాం

  • ఫేక్‌ ప్రచారాలతో మా మనసులు గాయపరచొద్దు

  • రాద్ధాంతం వద్దు.. ఆధారాలుంటే చూపండి

  • కాకినాడలో మెగా డీఎస్సీ టీచర్ల సమావేశం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

తాము అడ్డదారిలో ఉద్యోగాలు పొందలేదని, ఏళ్ల పాటు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించామని మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లు స్పష్టం చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ అసత్య, అవగాహన లేని, అనవసర రాద్ధాంతం చేస్తోందని, ఆధారాలుంటే ఆ పార్టీ చూపాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకతతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టేలా కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఆధ్వర్యంలో ‘డీఎస్సీపై బ్లూ మీడియా అసత్యప్రచారం.. నిరుద్యోగ యువతపై గొడ్డలి వే టు’ పేరుతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యూటీఎఫ్‌, ఎస్టీయూ, పీఆర్‌టీయూ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. డీఎస్సీపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, ఆయన అనుచరగణం చేస్తున్న అసత్య ప్రచారాలను ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా టీచర్లు తాము ఎలా ఉద్యోగం పొందిందీ, వైసీపీ దుష్ప్రచారంతో మానసికంగా తాము పడుతున్న వేదనను వివరించారు. పక్కా ప్రణాళికతో మెగా డీఎస్సీ నిర్వహించారని, తమ సర్టిఫికెట్లు క్షుణ్ణంగా పరిశీలించాకే ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఫేక్‌ ప్రచారాలు, ఆరోపణలతో తమ మనస్సులను గాయపరచవద్దని కోరారు. ఎటువంటి ప్రలోభాలు, పైరవీలు లేకుండానే ఉద్యోగాలు సాధించామని స్పష్టం చేశారు. లక్షలాది రూపాయల డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కొనే స్థోమత తమకు లేదన్నారు. తమ మనోభావాలు పణంగా పెట్టి వైసీపీ రాజకీయాలు చేయడం, వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని చూడటం నిజంగా దారుణమన్నారు. ప్రతిభతో ఉద్యోగం పొందిన వారి జీవితాలతో ఆటలాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు.


అక్కసుతోనే గొడ్డలి పార్టీ రాద్ధాంతం

దొంగలు పడిన ఆరు నెలలలకు కుక్కలు మొరిగాయి అన్నట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం విమర్శించారు. ఎనిమిది నెలల తర్వాత డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించడం విచిత్రంగా ఉందన్నారు. కేవలం కూటమి ప్రభుత్వంపై అక్కసుతోనే గొడ్డలి పార్టీ నేతలు ఇలాంటి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజాన్ని ముక్కలు చేసే సంస్కృతిని తీసుకురావద్దని, ఆధారాలుంటే చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించిన మెగా డీఎస్సీని రద్దు చేస్తామని జగన్‌ అనడం హాస్యాస్పదమన్నారు. డీఎస్సీ పోస్టుల సిఫార్సుల కోసం తన వద్దకు వస్తే.. అడిగిన వారి పోస్టులు ఊడిపోతాయి అని తమ నాయకుడు లోకేశ్‌ తమ పార్టీ నేతలను హెచ్చరించారని చెప్పారు. దీనిని బట్టే డీఎస్సీ ఎంత పారదర్శకంగా నిర్వహించారో అర్థం చేసుకోవాలని పేరాబత్తుల సూచించారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎంతో కష్టపడి ఉద్యోగాలు పొందిన వారిని కించపరిచేలా వైసీపీ ప్రవర్తిస్తోందన్నారు. ఈ సమావేశానికి వచ్చిన టీచర్లు చెప్పిన వాటిలో ఏవైనా తప్పులుంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రూ. ఐదు వేలు ఇచ్చి వలంటీర్ల శ్రమను దోచుకోవడమే కాకుండా.. వైన్‌ షాపుల వద్ద ఉపాధ్యాయులను నిలబెట్టించిన ఘనత కూడా గొడ్డలిపార్టీదేనని ఎమ్మెల్యే వనమాడి విమర్శించారు. సమావేశంలో హెడ్మాస్టర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.రవి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.ప్రదీ్‌పకుమార్‌, బండి నూకరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ, రామకృష్ణ, నోబెల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వి.సూరిబాబు, సీపీఎస్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్‌, పీఈటీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, అంధ ఉపాధ్యాయుడు, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ ప్రతినిధి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 04:04 AM