Share News

మళ్లీ మళ్లీ అదే యాగీ

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:02 AM

‘ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే వందలో పదిమంది అయినా నిజమని నమ్మకపోతారా? ఆ నమ్మినవారిలో నాలుగు ఓట్లు అయినా మనకు వేయకుండా పోతారా?’ అనే సిద్ధాంతాన్ని జగన్‌ పాటిస్తున్నారు.

మళ్లీ మళ్లీ అదే యాగీ

  • మెగా డీఎస్సీ, గ్రూప్‌-1పై జగన్‌ రెండు నాల్కల ధోరణి

  • మేమేం చేసినా ఒప్పు.. మీరేం చేసినా తప్పన్నట్టు వాదన

  • నాడు ‘సచివాలయాల’ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు

  • 2018 గ్రూప్‌-1లో ఆద్యంతం అక్రమాల పర్వం

  • వాటిని సమర్థిస్తూ అడ్డగోలుగా వాదనలు

  • మూల్యాంకనం, స్పోర్ట్స్‌ కోటాపై అవే అబద్ధాలు

  • ఒక్క ఆధారమూ లేకున్నా మెగా డీఎస్సీపై దుష్ప్రచారం

  • సిట్‌ నివేదికపైనా ద్వంద్వ వాదన

  • ప్రెస్‌మీట్‌లో జగన్‌ యథేచ్ఛగా అసత్యాల పర్వం

అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ‘ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే వందలో పదిమంది అయినా నిజమని నమ్మకపోతారా? ఆ నమ్మినవారిలో నాలుగు ఓట్లు అయినా మనకు వేయకుండా పోతారా?’ అనే సిద్ధాంతాన్ని జగన్‌ పాటిస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న ఆయన ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. తొలుత అపోహపడి ఆరోపణలు చేసిన అభ్యర్థులే ఆ తర్వాత వదిలేసినా.. జగన్‌ మాత్రం మెగా డీఎస్సీని వదలకుండా అవే అసత్యాల ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ హయాంలో జరిగింది అంతా ఒప్పేనని... కూటమి ప్రభుత్వంలో జరిగిందంతా తప్పనే వితండవాదనకు దిగుతున్నారు. డీఎస్సీలో భర్తీ చేసిన 15,941 ఉద్యోగాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న జగన్‌... అక్రమాలు జరిగిన 2018 గ్రూప్‌-1లో ఉద్యోగాలు సాధించిన 165 మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగితే అంతా సక్రమమేనన్న జగన్‌.. ఇప్పుడు పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ అంతా అక్రమమేనని, వెంటనే రద్దు చేసి అందరి ఉద్యోగాలు తొలగించాలని పట్టుబడుతున్నారు. గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మళ్లీ అవే అబద్ధాలను వల్లె వేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో డిజిటల్‌ మూల్యాంకనమే జరగలేదని, హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనంపై చర్చే అనవసరమని ఇంకా ఎన్నో అబద్ధాలు చెప్పారు. జగన్‌ చేసిన ఆరోపణలు, వాస్తవాలు..


మార్కులు ప్రామాణికం కానప్పుడు పరీక్షలెందుకు?

జగన్‌: డీఎస్సీ పరీక్షలు రాయకుండానే క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. క్రీడా కోటా అభ్యర్థులకు పరీక్షలు అక్కర్లేదట.

వాస్తవం: క్రీడా కోటా అభ్యర్థులకు రాత పరీక్ష అక్కర్లేదని ప్రభుత్వం 2025లో జీవో 4 జారీచేసింది. అందుకు అనుగుణంగా డీఎస్సీ భర్తీ జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో కనీస అర్హత మార్కులు ఉండవు. అలాంటప్పుడు పరీక్ష రాసినా, రాయకపోయినా ఒక్కటే. ఉదాహరణకు క్రీడా కోటాలో వంద మార్కులు సాధించిన అభ్యర్థికి మెడల్స్‌ తక్కువ ఉండి, పది మార్కులు వచ్చిన అభ్యర్థికి ఎక్కువ మెడల్స్‌ ఉంటే.. పది మార్కులు వచ్చిన అభ్యర్థికే ఉద్యోగం దక్కుతుంది. అంటే.. పరీక్షలు, మార్కులతో సంబంధం లేదు. అదే ఏపీపీఎస్సీ లాంటి ఉద్యోగాలకైతే కనీస మార్కులు సాధించాలి. కనుక క్రీడా కోటా అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాలి.

పొరపాటును అభ్యర్థే అంగీకరించాడు

జగన్‌: ఓవైపు సింధూ పేరు చెబుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన దుర్గయ్యకు ఉద్యోగం ఇవ్వలేదు.

వాస్తవం: పోలవరం జిల్లాకు చెందిన అనిగి దుర్గయ్య ఆర్చరీలో నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్టు. కానీ జాతీయ స్థాయిలో సిల్వర్‌ మెడల్‌ ఉందని మొదటి ప్రాధాన్యంలో వివరాలు సమర్పించాడు. శాప్‌ నిబంధనల ప్రకారం దరఖాస్తులో అభ్యర్థులకున్న ఉత్తమ మెడల్స్‌ను ప్రాధాన్య క్రమంలో పెట్టాలి. కానీ దుర్గయ్య పొరపాటున సిల్వర్‌ను మొదట పెట్టాడు. దీంతో ఉద్యోగం రాలేదు. కోర్టుకు వెళ్లిన దుర్గయ్య అఫిడవిట్‌లో పొరపాటు అంగీకరించాడు. స్వయంగా అభ్యర్థే పొరపాటును అంగీకరించినా పదే పదే అతని పేరును తెరపైకి తెచ్చి రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.


సంబంధం లేదని తప్పులను వదిలేయాలా?

జగన్‌: గ్రూప్‌-1 అంశంలో హాయ్‌ల్యాండ్‌లో ఏదో జరిగిపోయిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియకూ, తుది ఫలితాలకూ సంబంధమే లేదు. హాయ్‌ల్యాండ్‌ అనేది టాపిక్కే కాదు.

వాస్తవం: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనంలో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు అరాచకంగా వ్యవహరించారని సిట్‌ స్పష్టంచేసింది. ఒకే నోటిఫికేషన్‌ మెయిన్స్‌ సమాధాన పత్రాలను మొత్తం మూడుసార్లు మూల్యాంకనం చేయించారు. మొదటిసారి డిజిటల్‌ జరగగా.. రెండోసారి ప్రైవేటు రిసార్ట్‌ హాయ్‌ల్యాండ్‌లో జరిగింది. 84 రోజులు సమాధాన పత్రాలను అక్కడే ఉంచి మూల్యాంకనం చేశారు. ఎలక్ర్టీషియన్లు, వాచ్‌మెన్‌, గృహిణులతో మార్కులు వేయించారు. మొదట జరిగిన డిజిటల్‌ మూల్యాంకనాన్ని కోర్టు వద్దనడంతో అవే ఫలితాలను హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనంలో ప్రతిబింబించేలా చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో గౌతం సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌ అయ్యాక హాయ్‌ల్యాండ్‌ కథను పక్కన పడేశారు. మూడోసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేయించారు. అయితే హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనంతో ఫలితాలు రానంతమాత్రాన ఆ అక్రమాలను ఎలా వదిలేస్తారు? కీలకమైన గ్రూప్‌-1 ఉద్యోగాల సమాధాన పత్రాలను ప్రైవేటు వ్యక్తుల పర్యవేక్షణలో ఎలా ఉంచుతారు? దీనికి సంబంధించి ప్రైవేటు ఏజెన్సీలకు బిల్లులు ఎందుకు చెల్లించారు? ఒకవేళ నిజంగానే హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగకపోతే.. మూడోసారి మూల్యాంకనానికి 44వేల ఓఎంఆర్‌ బార్‌కోడ్‌లు ఎందుకు కొనుగోలు చేశారనే ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెప్పడం లేదు.


నవీన్‌పై మీ వైఖరేంటి?

జగన్‌: ఎస్‌సీఈఆర్‌టీలో పనిచేసిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్‌కు క్వశ్చన్‌ బ్యాంక్‌ను యాక్సెస్‌ చేసే అవకాశం ఉంది.

వాస్తవం: ఎస్‌సీఈఆర్‌టీ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌.. శాఖ అనుమతి లేకుండా డీఎస్సీ పరీక్షలు రాశాడు. ఇది తెలిసిన వెంటనే అతన్ని ఎస్‌సీఈఆర్‌టీ నుంచి తొలగించారు. అయినా సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్‌ లెటర్‌ పంపారు. కానీ అతడు హాజరుకాలేదు. ఉద్యోగం రాలేదు. నవీన్‌కు ఉద్యోగం ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్న జగన్‌.. మరోవైపు అతనికి క్వశ్చన్‌ బ్యాంక్‌ యాక్సెస్‌ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్రమాలు జరిగాయని అంటున్నారు. అసలీ విషయంలో జగన్‌ వైఖరేంటి? నవీన్‌కు ఉద్యోగమివ్వాలా? క్వశ్చన్‌ బ్యాంక్‌ చూసే అవకాశం ఉందని ఉద్యోగం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలా? మరోవైపు గతంలో... గ్రామ/వార్డు సచివాలయాల భర్తీలో ఏపీపీఎస్సీలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి టాపర్‌ అయ్యారు. బంధువులు, స్నేహితులు కూడా టాప్‌ మార్కులు సాధించారు. దీనిపై అప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నిస్తే.. ఏం ఏపీపీఎస్సీలో ఉన్న ఉద్యోగులు పరీక్షలు రాయకూడదా? ర్యాంకులు సాధించకూడదా అని జగన్‌ ఎదురు ప్రశ్నించారు.


సిట్‌ నివేదిక చదవాలి సార్‌

జగన్‌: 2018 గ్రూప్‌-1లో ఎలాంటి అక్రమాలు లేవని సిట్‌ చెప్పింది. ఎగ్జామినర్లే సవరణలు చేశారని పేర్కొంది. అయినా గుర్తుతెలియని వ్యక్తులు సవరణ చేశారని అంటున్నారు.

వాస్తవం: సాక్షి తరహాలోనే జగన్‌ కూడా సిట్‌ నివేదిక ఉద్దేశాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్‌ మూల్యాంకనంలోనూ, తుది మూల్యాంకనంలోనూ అనేక అక్రమాలు జరిగాయని సిట్‌ చాలా స్పష్టంగా చెప్పింది. మొదటిసారి జరిగిన డిజిటల్‌ మూల్యాంకనంలో అభ్యర్థుల సమాధాన పత్రాల బార్‌కోడ్‌లే మారిపోయాయి. సమాధాన పత్రంలోని మొదటిపేజీ, లోపలి పేజీల బార్‌కోడ్‌లు సరిపోలలేదు. ఇక తుది మూల్యాంకనంలో 95శాతం సమాధాన పత్రాల్లో సవరణలు చేశారు. అనేక చోట్ల చీఫ్‌ ఎగ్జామినర్లు సవరణలు చేసి సంతకాలు చేశారు. ఏపీపీఎస్సీ ఇచ్చిన పెన్నులు కాకుండా ఇతర ఇంకుతో మార్పులు చేసినట్లు సిట్‌ గుర్తించింది. ఇన్ని అక్రమాలు జరిగినట్లు సిట్‌ స్పష్టంగా చెప్పినా సిట్‌ అంతా సక్రమమే చెప్పిందంటూ జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మరో సందర్భంలో సిట్‌లో ఉన్నవారంతా చంద్రబాబు కింద పనిచేసే అధికారులేనని ఆరోపణలు చేశారు. అంటే.. చంద్రబాబు కింద పనిచేసే అధికారులే తమకు అనుకూలంగా ఏదైనా చెబితే అది మాత్రం కరెక్ట్‌ అని, అదే సిట్‌ వ్యతిరేకంగా చెబితే చంద్రబాబు చెప్పినట్లు నివేదిక ఇచ్చారని జగన్‌ మాట్లాడుతున్నారు. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగిందని ఇదే సిట్‌ చెబితే జగన్‌ అంగీకరించడం లేదు. ఇంతకీ సిట్‌ నివేదికను నమ్ముతారా? లేదా? అనేది జగన్‌ మొదట తేల్చుకోవాలి.


అప్పట్లో మీరేం చేశారు?

జగన్‌: ప్రశ్నపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతను ఒకరికే అప్పగించారు.

వాస్తవం: డీఎస్సీ నిర్వహణలో ఎస్‌సీఈఆర్‌టీది కీలక పాత్ర. ప్రశ్నల రూపకల్పన బాధ్యతను ఇది చూస్తుంది. డీఎస్సీ నిర్వహణకు.. ఇతరత్రా బాధ్యతల్లో ఉన్న అధికారికి తాత్కాలికంగా కన్వీనర్‌ బాధ్యత అప్పగిస్తారు. ప్రశ్నల రూపకల్పన, పరీక్షల నిర్వహణ ఒకరి పరిధిలో ఉంటే ఆలస్యం కాకుండా ఉంటుందని ప్రభుత్వం ఒకే అధికారిని నియమించింది. జగన్‌ సీఎం అయిన కొత్తలో నిర్వహించిన సచివాలయాల ఉద్యోగాల ప్రశ్నల సెట్టింగ్‌, పరీక్షల నిర్వహణ సర్వబాధ్యతలను ఏపీపీఎస్సీకే అప్పగించారు. ఇప్పుడు డీఎస్సీలో కన్వీనర్‌ నియామకం తప్పయితే సచివాలయాల ఉద్యోగాల భర్తీ మొత్తం తప్పే అవుతుంది. ఎస్‌సీఈఆర్‌టీ, డీఎస్సీకి వేర్వేరు అధికారులను నియమించి ఉంటే సమన్వయ లోపంతో ప్రక్రియలో జాప్యం ఏర్పడేది. ఈలోగా కోర్టులో వేసిన వందల కేసుల్లో ఒక్కదాంట్లో స్టే వచ్చినా మొత్తం భర్తీ ఆగిపోయేది.

Updated Date - Aug 21 , 2026 | 04:03 AM