మెగా డీఎస్సీపై మరో డ్రామా!
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:24 AM
ఐదేళ్లు అధికారంలో ఉన్నా వైసీపీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కూటమి సర్కారు ఒకే నోటిఫికేషన్‌తో 16వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పిల్
మొన్నటిదాకా వైసీపీ నేతల వరుస ఆరోపణలు
ప్రభుత్వ విస్పష్ట వివరణతో అంతా సైలెన్స్
తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
‘క్యాజువల్‌గా వేశారు’ అంటూ ధర్మాసనం వ్యాఖ్య
పత్రాలు పద్ధతిగా లేకపోవడంపైనా అభ్యంతరం
క్షమాపణలు చెప్పి వ్యాజ్యం వెనక్కి
మళ్లీ దాఖలు చేస్తామన్న ఎమ్మెల్సీ
అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు అధికారంలో ఉన్నా వైసీపీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కూటమి సర్కారు ఒకే నోటిఫికేషన్‌తో 16వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. మెగా డీఎస్సీపై కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. ఉపాధ్యాయ నియామకాలకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వైసీపీ నేతలు మొన్నటిదాకా డీఎస్సీపై రకరకాల ఆరోపణలతో రచ్చ చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రతి అంశంపైనా స్పష్టమైన వివరణ ఇవ్వడంతో మౌన ముద్ర వేశారు. ఇప్పుడు రూటు మార్చి... డీఎస్సీపై హైకోర్టుకెక్కారు. సీబీఐ విచారణ జరపాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ‘పిటిషన్‌ను మరీ ఆషామాషీగా దాఖలు చేశారు’ అని కోర్టు అభిప్రాయపడటంతో... దానిని వెనక్కి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, క్రీడాకోటా కింద అనర్హులకు పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యాజ్యం సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే... పిల్‌కు అదనపు డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకొని తిరిగి దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు.
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని... పిల్‌ను చాలా క్యాజువల్ విధానంలో దాఖలు చేశారని ఆక్షేపించింది. పిల్‌లో చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంట్లను జత చేయలేదని పేర్కొంది. అలాగే... ఆయా పత్రాలను వరుస క్రమంలో పెట్టకుండా పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది క్షమాపణ కోరారు. అనంతరం ధర్మాసనం పిల్‌ను కొట్టివేస్తూ, ఉపసంహరణకు అనుమతి (డిస్‌మిసల్ యాస్ విత్ డ్రాన్) ఇచ్చింది. తాజాగా పిల్ దాఖలు చేసుకొనేందుకు పిటిషనర్‌కు అవకాశమిచ్చింది. అదే సమయంలో... పిల్ విచారణార్హతపై తాము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడంలేదని పేర్కొంది.
ఒక్కో అంశంపై వివరణ ఇచ్చినా
డీఎస్సీ నియామకాలు పూర్తయిన ఆరేడు నెలల తర్వాత వైసీపీ దీనిపై బురదజల్లడం మొదలుపెట్టింది. పలువురు డీఎస్సీ అభ్యర్థులతో జగన్ భేటీ అయి... ‘వీళ్లందరికీ అన్యా యం జరిగింది’ అని ఆరోపించారు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కొందరు అభ్యర్థులూ ఆరోపణలు చేశారు. వారందరి విషయంలో ఏం జరిగింది? ఎవరికి, ఎందుకు ఉద్యోగం రాలేదు... అనే విషయంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. హారిజంటల్ రిజర్వేషన్‌ను అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగిన అపోహలనూ తొలగించారు. ఇం త జరిగినా... వైసీపీ తీరు మారకపోవడం, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యర్థుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.